
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కంకణాలకు ప్రజలు మోసపోతారా?..
బహుశా దేశంలోనే ఎవరూ చేయని సరికొత్త ప్రయోగాన్ని చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. రాజకీయాలలోకి మంత్రశక్తులను ప్రవేశ పెట్టబోతున్న ఘనత ఆయనకే దక్కవచ్చు!. మహాశక్తి పేరుతో ఏపీలో మహిళలకు కొన్ని కొత్త హామీలను ఇచ్చిన చంద్రబాబు మహాశక్తి చైతన్య రథయాత్రను ఆరంభించారట. ఆ సందర్భంగా ఆయన కొత్త , కొత్త విషయాలను వెల్లడించారు. ఆ క్రమంలోనే టీడీపీ ఆధ్వర్యంలో మంత్రాల ప్రోగ్రామ్ కూడా చేపడుతున్నారు. ఈనాడు కథనం ప్రకారం.. ‘మహాశక్తి దసరా’ పేరుతో టీడీపీ కంకణాలను పంపిణీ చేస్తుందట. స్వయంగా చంద్రబాబే ఈ సంగతి చెప్పారు.
‘‘మహాశక్తి దసరా పేరుతో మీకు కంకణాలు పంపిస్తాను. మీరు ఏ మతం వారైనా దానిని పూజ గదిలో ఉంచండి. 41 రోజులపాటు దీక్ష చేయండి. ఇంటింటికి వెళ్లి మహాశక్తి పధకాలను వివరించండి’’ అని టీడీపీ మహిళలను చంద్రబాబు కోరారు. ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎన్నడూ వినని విషయమే!!.
✍️ ఏ పార్టీ అయినా మతానికి ,రాజకీయానికి ముడిపెడితే అది తీరని అపచారం. దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీలు అదే ప్లాంక్ పై ఎన్నికలలో పాల్గొంటున్నాయి.ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకు వేసి కంకణాల మంత్రాలను టీడీపీ కార్యకర్తల ముందుకు తెచ్చింది. దీనిని బట్టే వచ్చే ఎన్నికలలో విజయావకాశాలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్ని సందేహాలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఓకే.. తాను కొత్తగా అమలు చేస్తామని ఇచ్చిన హామీలను ప్రచారం చేయండని చెప్పడం తప్పు కాదు. కానీ.. మధ్యలో ఈ కంకణాల గొడవ ఏమిటో తెలియదు!. ఎవరు సలహా ఇచ్చారో కాని, వారి ఉద్దేశం ఈ కంకణాల దెబ్బకి హిందువుల ఓట్లన్నింటిని మాయ చేసి వేయించుకోవచ్చని అనుకుంటున్నారేమో తెలియదు.
చంద్రబాబు ఈ సందర్భంలో ఏ మతం వారైనా పర్వాలేదు.. పూజ గదిలో ఉంచండని అన్నారు. కొన్ని ఇతర మతాలు ఇలా పూజగదులు నిర్వహిస్తాయా? వారు ఇలాంటి కంకణాలను పూజిస్తారా? కంకణాల స్కీమ్ ఎక్కువగా ఉన్నది హిందూమతంలోనే కదా! దానిని తనకు అనుకూలంగా మలచుకోవాలని టీడీపీ ప్లాన్ వేస్తోందన్నమాట. దీనిని ప్రజలు గుర్తించలేరన్నది వారి నమ్మకం కావచ్చు.
✍️ కానీ.. ప్రజలు అంతకన్నా మించిన తెలివైనవారు. ఒక రాజకీయ పార్టీ తరపున 41రోజుల దీక్ష చేయడం ఎక్కడైనా ఉందా? ఇదంతా జనాన్ని విశ్వాసాల పేరుతో మోసం చేయడం కాక మరేమిటి?.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేను ఏళ్లపాటు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబులో ఆత్మ విశ్వాసం ఎంతగా దెబ్బతిన్నది తెలుసుకోవడానికి ఈ ప్రకటన ఒక్కటి చాలు. అయినా మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఇలాంటి కంకణాలకు ప్రజలు మోసపోతారా? నిజంగానే చంద్రబాబు ప్రకటించిన మహాశక్తి పథకాలపై అంత భరోసా ఉంటే ఆయన ఈ కంకణాలు, మంత్రాలు దీక్షలు అంటూ కొత్త పల్లవి ఎందుకు అందుకుంటారు? ఆయన స్కీములతో భవిష్యత్తుకు గ్యారంటీ అట. చంద్రబాబు మాటకు తిరుగులేదట. తన ట్రాక్ రికార్డు ఏమిటో ఆయనకు తెలియదా? ఇది బాబు గ్యారంటీ అట. రాజకీయాలలో ఇలాంటి నినాదాలు ఇచ్చే ముందు కాస్త అయినా ఇంగితంతో ఆలోచించాలి కదా! అదేమీలేదు.
✍️ ఎప్పటికప్పుడు కొత్త రాగం అందుకుంటే పాత రాగాన్ని ప్రజలు మర్చిపోతారన్నది చంద్రబాబు కాన్సెప్ట్. అందుకే ఇంత ధైర్యంగా ఆయన ఈ ఊకదంపుడు గ్యారంటీ కబుర్లు చెబుతున్నారు. 2014 శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కటన్నా శుద్దంగా అమలు చేశారా? లేదే! డ్వాక్రా మహిళల రుణమాఫీ కాని, బెల్టు షాపుల రద్దు కాని ఇలాంటివి ఏమైనా చేశారు. పోనీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న వివిధ స్కీములను తాను అమలు చేస్తానని మోహమాటపడకుండా చెబుతున్నారు. పైగా జగన్ అమలు చేసిన వాటికి నాలుగైదు రెట్లు జనానికి డబ్బులు ఇస్తారట.
జగన్ అమ్మ ఒడి కింద ఒక్క బిడ్డకు 15 వేల రూపాయలు చొప్పున ఇస్తుంటేనే రాష్ట్రం నాశనం అయిందని, బటన్ నొక్కడం తప్ప ఏమి చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు, పవన్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు ఇప్పుడు చంద్రబాబు స్కీములు అదరహో అంటున్నారు. చంద్రబాబు హామీ ప్రకారం ఒక ఇంటిలో నలుగురు పిల్లలు ఉన్న వారందరికి కలిపి తల్లికి వందనం పేరుతో అరవైవేల రూపాయలు ఇవ్వడానికి బటన్ నొక్కుతారట. అప్పుడు రాష్ట్రం నాశనం కాదని రామోజీ, రాధాకృష్ణలు చంకలు గుద్దుకుంటూ రాస్తున్నారు. ఇది మహాస్త్రం అని బిల్డప్ ఇస్తున్నారు.
✍️ ఇదే ఆత్మవంచన అంటే. చంద్రబాబు,పవన్ లు అలా చేస్తున్నారంటే ,అధికారం కోసం ఏదో తంటాలు పడుతున్నారులే అనుకోవచ్చు. కాని రామోజీరావు తదితర ఎల్లో మీడియాకు ఏమైంది? బుద్ది ఉన్న ఏ మీడియా అయినా ఏమని అడగాలి. ఒక్క బిడ్డకు ఇస్తుంటేనే తిట్టాం కదా! ఇప్పుడు ఇంతమందికి ఎలా అని అడగాలి. అలా అడగకపోగా.. ‘ఆహా.. ఓహో’.. అంటూ సమర్ధనలు. ఇలా ఉంది వారి జర్నలిజం. ఇదొక్కటే కాదు. అంటే చంద్రబాబు చేసే తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయడానికి ఈ మీడియా వంతపాడుతోందన్నమాట.
✍️ అదే కాదు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తారట. దీనిని జనం నమ్ముతారా? దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు, ఆడవారికి ఆర్టీసీ బస్‌లలో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి స్వచ్చమైన నీరు ఇస్తామని చంద్రబాబు ఈ స్కీములలో తెలిపి.. వీటికి కంకణాలు కట్టుకుని మరీ ప్రచారం చేయండని చంద్రబాబు పార్టీవారికి సూచిస్తున్నారు.
✍️ ఇన్నేళ్ల అనుభవం తర్వాత చంద్రబాబు తాను ఇంతకాలం మహిళలకు ఏమీ చేయలేదని ఒప్పుకుంటున్నారన్నమాట. ఒకపక్క తాము మహిళలకు అంత చేశాం..ఇంత చేశాం అని చెప్పుకునే ఆయన వారికి ఈస్థాయిలో హామీలు ఇచ్చారంటే , ఆయన పాలన ఎంత అధ్వాన్నంగా సాగిందో చెప్పకనే చెబుతున్నట్లయింది.ఈ హామీలతో స్త్రీలకు ఇక భయం ఉండదట. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా వెళతారని మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త సంగతులు కనిపెట్టారు. ఆడవాళ్లకు కుడివైపున మెదడు ఉంటుందని, మగవాళ్లకు ఎడమవైపు మెదడు ఉంటుందని, అందువల్ల మహిళలే తెలివైనవారని ఆయన తేల్చేశారు. వారే శక్తిమంతులు అని కూడా ప్రకటించేశారు.ఇదంతా సైంటిఫిక్ గా రుజువు అయిందట. అక్కడితో ఆగలేదు.
✍️ ఎడమ చేయి కన్నా కుడి చేయి మంచిదట. ఇది కూడా సైన్సే చెప్పిందా? ఎవరైనా రెండు చేతులు సమానమని చెప్పాలి. అలాకాకుండా ఇలా మూర్ఖత్వాన్ని ప్రబోధిస్తున్నారంటే ఏమనుకోవాలి? ఆయన మాట్లాడినవారిలో ఏనభై శాతం మంది మహిళలకు వారి భర్తలకన్నా ఎక్కువ జీతం వస్తోందని కూడా ఆయన సెలవిచ్చారు. తెలివితేటల విషయంలో అయినా మరోకదానిలో అయినా ఇద్దరు సమానం అని చెప్పాల్సిన సీనియర్ నేత ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే ఏమనుకోవాలి?
ఇక్కడ సహజంగానే ఒక సందేహం వస్తుంది కదా? మహిళలే తెలివైనవారని చంద్రబాబు చెప్పిందాని ప్రకారం.. ఆయన భార్య భువనేశ్వరి తెలివైనవారనే కదా?.. లోకేష్ కన్నా, ఆయన భార్య బ్రాహ్మణి తెలివైనవారనే కదా? మరి అలాంటి తెలివైనవారికి రాజకీయాలలో అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు ఎందుకు జాగ్రత్తపడుతున్నారు. లోకేషే పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? అంటే తన ఇంటిలో మాత్రం ఆ సూత్రం వర్తించదని చెప్పదలిచారా?
✍️ ఇప్పుడు ఆడపిల్లలకు కట్నం ఇచ్చే రోజులు వచ్చాయట.అది తెలుగుదేశం స్పూర్తి అని కూడా ఘంటాపథంగా చెప్పేశారు. అసలు కట్నాల జోలికి వెళ్లవద్దని హితబోధ చేయాల్సిన చంద్రబాబు.. ఆడవారిని కట్నం తీసుకోవాలని చెబుతున్నట్లుగా లేదా?. సరే.. ఆయన చెప్పినదానిలో నిజం ఎంత ఉందన్నది ఆలోచిస్తే తెలిసిపోతుంది. అది వేరే విషయం. ఈ మహాశక్తితో రాష్ట్రంలోని 2.50 కోట్ల మంది మహిళల జీవాతాలు మారిపోతాయని కూడా ఆయన అంటున్నారు. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నమాట. ఆయన పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నా మహిళల జీవితాలను బాగు చేయలేదని ఒప్పుకుంటున్నట్లే కదా? గతంలో ఏది ఉచితం కాదని ఆయన అనేవారు. అలాగే తన మనసులో మాట పుస్తకంలో కూడా ఉటంకించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిదీ ఫ్రీ అని చెప్పేస్తున్నారు.
✍️ కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడబిడ్డలను అవమానించేలా దిక్కుమాలిన పాత సామెతను వాడిన చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం మహిళల ఓట్లు అవసరం అయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రతి స్కీమ్ లోను మహిళలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో వారిలో వైఎస్సార్‌సీపీలో విశ్వాసం పెరిగింది. దానిని చెడగొట్టడం కోసం చంద్రబాబు మహాశక్తి అని, కంకణాలని రకరకాల ఎత్తుగడలు పన్నుతున్నారు. చివరికి చేతబడులు కూడా చేయించి ,తామే గెలుస్తామని చంద్రబాబు భ్రమిస్తారేమో చూడాలి.
ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్(దివంగత) రాజకీయాలలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన ఇలాంటి మంత్రాలపై,కంకణాలపై ఆధారపడలేదు. ప్రజలపై నమ్మకం ఉంచారు. ప్రస్తుతం చంద్రబాబు ఈ కంకణాలను,మంత్ర తంత్రాలను,చేతబడులను నమ్ముకునే స్థాయికి తెలుగుదేశం పార్టీని దిగజార్చారనుకోవాలి.
::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్