
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థాన్ నారాయణపురంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధం.. ఎంత దూరమైన పోతా’’ అంటూ వ్యాఖ్యానించారు.
‘‘ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది. మునుగోడు ప్రజల కోసం నేను మంత్రి పదవి వదులుకున్నాను. నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు. భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తామన్నారు. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల ఆలోచన. పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదు. నా స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లేదు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
నాలాంటి వాడికి మంత్రి పదవి వస్తే ఇంకా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు కావాలి. మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా అది మీ ఇష్టం. నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నాను. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను. వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు. నాకన్నా చిన్నవారికి పదవులు ఇచ్చారు. మీరు ఎంపీ గెలిపించుకో అంటే గెలిపించాను. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు. మనసు దిగజార్చుకొని బతకడం నాకు తెలియదు. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయను’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.