దుబ్బాక ఫలితాలు : ‘అడుగడుగనా ఇబ్బందులకు గురిచేశారు’

kishan reddy Responds On BJP Victory In Dubbaka Bypoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో తెలంగాణ ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టి అధికార పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విజయాన్ని తమ విజయంగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో​ అధికారులు పక్షపాతంగా వ్యకహరించారని ఆరోపించారు. బీజేపీ నేతలు ప్రచారానికి వెళ్తే గంటల తరబడి రోడ్లపై నిలబెట్టారని మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ పాలన శాశ్వతం కాదని, సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ది చెబుతారనేదానికి దుబ్బాక ఫలితాలే నిదర్శనం అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకున్న దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాకలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చూపిస్తామన్నారు. 
(చదవండి : దుబ్బాక ఫలితాలపై స్పందించిన కేటీఆర్‌ )

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్‌ఎస్‌ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్‌ విజయం సాధించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top