ఏ విచారణకైనా రెడీ

Kakani Govardhan Reddy Comments On Somireddy Chandramohan Reddy - Sakshi

టీడీపీ నేత సోమిరెడ్డికి ఎమ్మెల్యే కాకాణి సవాల్‌

నెల్లూరు సెంట్రల్‌: ఆనందయ్య ఇస్తున్న కరోనా నివారణ మందు విషయంలో తనపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జి, లేదా విశ్రాంత న్యాయమూర్తితో ఏ విచారణకైనా తాను సిద్ధమని వైఎస్సార్‌సీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. నెల్లూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయలేదని.. కలెక్టర్‌ నిలిపివేసిన విషయం గుర్తులేదా సోమిరెడ్డి అని ప్రశ్నించారు. మందు విక్రయానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో తాను డైరెక్టర్‌నని అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సదరు వెబ్‌సైట్‌కు తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. తాను తప్పుచేసినట్లు రుజువు చేస్తే బహిరంగంగా ఉరేసుకుంటానన్నారు. అలాగే.. నకీలీ ఎరువులు తయారుచేసి రైతులను మోసం చేయలేదని.. మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని రైతులను దగా చేయలేదని.. క్రికెట్‌ కిట్లు,, సైకిళ్లు పంపిణీలో అవినీతి చేయలేదని.. పేకాటలో ఎవరికీ అప్పు లేనని నువ్వు, నీ కొడుకు ప్రమాణం చేయడానికి సిద్ధమా సోమిరెడ్డి అని కాకాణి సవాల్‌ చేశారు. సోమిరెడ్డి ఆరోపణలపై శేశ్రిత టెక్నాలజీ అధినేత నర్మద్‌రెడ్డి స్పందిస్తూ.. సోమిరెడ్డి అన్నీ అవాస్తవాలు మాట్లాడారన్నారు. కనీసం తనను సంప్రదించి ఉంటే వాస్తవాలు చెప్పే వాళ్లమని.. దీనిపై అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.

ఆనందయ్య మందుతో వ్యాపారం: సోమిరెడ్డి
నెల్లూరు టౌన్‌: ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి భారీ కుట్ర పన్నినట్లు టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందు అమ్మకం పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది నెల్లూరుకు చెందిన శేశ్రిత కంపెనీ అన్నారు. ఈ నెల 2న చిల్‌డీల్‌ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్‌లో పెట్టిందన్నారు. దీనిపై ఆరోపణలు రావడంతో మరుసటి రోజే వెబ్‌సైట్‌ను తొలగించారన్నారు. కాగా, మందు ప్యాకెట్‌ ధర రూ.15గా.. జీఎస్టీ, కొరియర్‌ చార్జీలతో కలిపి రూ.167 పెట్టారన్నారు. ప్రజల నుంచి వందల కోట్లు సొమ్ము చేసుకోవాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top