ఎల్లో చానెల్‌లో మీటింగ్‌లు.. చాటింగ్‌లు

Jogi Ramesh On Yellow Media Chandrababu - Sakshi

మీరు సూపర్‌ బాబూ..

బీఆర్‌ నాయుడుతో చెట్టాపట్టాల్‌

ఎల్లో సిండికేట్‌ అంటే ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోంది

చంద్రబాబు టీవీ–5 టూర్‌పై మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా

సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబునాయుడు గారూ.. మీరు చాలా సూపర్‌. ఎల్లో సిండికేట్‌ అంటే ఇప్పటివరకు చాలామందికి అర్థంకాలేదు. మీ టీవీ–5 టూర్‌తో అది ఇప్పుడు పూర్తిగా అర్ధమవుతోంది’’.. అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీవీ–5 స్టుడియోకు వెళ్లడం, అక్కడి సిబ్బందితో మాట్లాడడం, చానెల్‌ అధినేత బీఆర్‌ నాయుడుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తుంటే వీరిమధ్య బంధం ఎలాంటిదో ఇట్టే అర్ధంచేసుకోవచ్చని రమేష్‌ వ్యాఖ్యానించారు.

ఎల్లో మీడియా, చంద్రబాబు బినామీలు, చంద్రబాబు కలిస్తే ఎల్లో సిండికేట్‌ అన్న విషయం ఇన్నాళ్లూ చాలామందికి తెలీదని.. ఇప్పుడిప్పుడే అందరూ అర్ధంచేసుకుంటున్నారని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తుంటే ఎల్లో మీడియా దానికి అనుబంధంగా పనిచేస్తోంది. తాజాగా.. టీవీ–5 చానెల్‌ స్టుడియోకు వెళ్లిన చంద్రబాబు వారితో ఎడిటోరియల్‌ మీటింగ్‌ నిర్వహించినట్లు కనిపిస్తోంది. చానెల్‌ ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేసినట్లు అక్కడి వాతావరణాన్ని బట్టి అర్ధమవుతోంది.

ఎల్లో సిండికేట్‌లో భాగంలా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజు వంటివాళ్లు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం, చివరికి కోర్టు మెట్లెక్కి చివాట్లు తినడం చూస్తున్నాం. ఇప్పటివరకు వ్యవస్థలను వాడుకోవడం, మీడియాను మేనేజ్‌ చేయడం గురించి విన్నాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వయంగా చంద్రబాబు ఓ స్టుడియోకు వెళ్లి అక్కడి వారికి ఏమేం చేయాలో చెప్పడం చూస్తుంటే మరింత బరితెగించేందుకు అందరూ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది’’ అని జోగి రమేష్‌ పేర్కొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top