పెద్దారెడ్డి టాక్స్: ‘తగ్గడంలో ఉంది మజా..!’ | Sakshi
Sakshi News home page

పెద్దారెడ్డి టాక్స్: ‘తగ్గడంలో ఉంది మజా..!’

Published Fri, Jan 12 2024 8:00 AM

Janasena Pawan Kalyan Political Situation In AP - Sakshi

అదేందబ్బయ్యా అదీ.. అత్తను పుట్టింటికి తోడుకోని పోడానికొచ్చి, డైవరు యేసం గట్టి ఒక సినిమా జేసినావే.. ఆ సిన్మాలో నువ్వేదో అత్త ఎదురుగా మోకాళ్ల మీద కూలబడంగానే.. నీ తెలివితేటల గురించి ఆ ఎమ్మెస్సు ఏదో అంటాడే ఏందబ్బయ్యా అది?.

‘ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు’ అనే గదా..! అవునబ్బయ్యా.. సరైన మాటే అన్నాడు. ఆడు సినిమాలో జెప్పిన డైలాగుదేముండాది గానీ.. నువు నిజంగానే శానా శానా గొప్పోడివబ్బయ్యా.. ‘తగ్గడం’లో మజా తెలిసిన నీబోటి పొలిటీషియన్ ఇయ్యాల రేపట్లో బూపెపంచికంలోనే లేడంటే లేడు గదా!..

నిరుడు ఎలచ్చన్లు జరిగే యేళకి ఎన్ని మాటలు జెప్పినావబ్బయ్యా! ఎగిరెగిరి మాట్లాడినావు గదా.. జుట్టు ఎగదోసుకుంటా సెంద్రబాబుని తూర్పారబట్టినావు గదా! ఈ స్టేటుని నాశినం బట్టించినాడని మెడ రుద్దుకుంటా డైలాగులేసినావు గదా..! మరేటయ్యిందీ.. ఈసారి ఎలచ్చనొచ్చేపాటికి ఆయనేమో నీకు ఉన్నపళంగా దేవుడైపొయినాడా? ఆయన పల్లకీ మొయ్యాల్సిందే అని కుశాలపడతన్నావు గదా! యింతకంటె తగ్గడంలోని మజా యింకోటి యేముండబోతాది అబ్బయ్యా!

పాపం.. కాపు కులపోళ్లంతా నిన్ను నమ్ముకోని రాజకీయంగా తమ కులానికేదో వైబోగం పట్టబోతాదని యిన్నాళ్లుగా కళ్లలో వత్తులేసుకోని యెదురుజూస్తాంటే.. వోళ్లందరికీ షాకు మీద షాకిచ్చినావు గదా! యే వూరికైనా పో.. నిన్ను నమ్ముకున్న కులం మనుషుల్లో ఎవురినైనా పలకరించు.. గుండెలమీద సెయ్యేసుకోని నికార్సుగా నిజం జెప్పమని అడుగు! గుండె నిబ్బరం జేసుకోని యిను. అప్పుడు జెప్తారబ్బయ్యా.. కులాన్నంతా కట్టగట్టుకోని తీసకపొయ్యి సెంద్రబాబు కాళ్లకాడ పడేస్తాండావని. ఒక్కొక్కడూ యెంతెంత కుమిలిపోతా వుండారో..? ‘సెంద్రబాబు గోరి ఎక్స్‌పీరియెన్సు ఈ స్టేటుకి శానా శానా గావాల.. కాబట్టి మన పార్టీ వోళ్లందరూ.. పచ్చజెండాలు ఎత్తాల.. పంచెలెగ్గట్టుకోని ఆయన పల్లకీ మొయ్యాల.. అని నంగి మాటలు జెప్పబోక! యీసారి ఎలచ్చన్లలో ఒక్క సీటైనా గెలస్తామో లేదో అనే నీ బయ్యంలో పార్టీని మటుకే కాదు అబ్బయ్యో.. కులానికి మొత్తం కడుపుమంట బెడితివే. తగ్గడం అంటే అదేననుకోవాలా యెట్టా?

ఇప్పుడు లేటెస్టుగా నువ్వు తగ్గిన తమాసా వుండాదే.. అది యింకా యిచిత్రం! మొన్న మొన్నటిదాకా ఆ ముద్రగడ పెద్దాయిన నీ పరువు తీసినాడు! ‘వురేయ్ నాయినా.. ఆ సెంద్రబాబు మన కాపుల్ని బీసీ కులాల్లో పెట్టిస్తానన్జెప్పి నట్టేట ముంచినాడురా! ఆయన పంచన జేరి, ఆయన మోచేతి నీళ్లు తాగతా బతకతాండావేందిరా..’ అనేసి నిన్ను నానా మాటలూ అనేసినాడు. ఆ మాటకొస్తే సెంద్రబాబు నాయుడు ఎంత మోసకారి మడిసో, నువ్వెంత సేతగాని నాయకుడివో ఆయనంత బాగా యిడమరిసి సెప్పిన పెద్దమడిసి యింకోడు లేడంటే నమ్ము. నీ బాగోతాన్ని పేజీలు పేజీలుగా లెటర్లురాసి నడిబజార్లో బండారం బయటపెట్టేసినాడు గదా. 

తగుదునమ్మా అంటా యిప్పుడు బొయ్యి.. అదే పెద్ద మడిసిని వాటేసుకోబోతండావా అబ్బయ్యా! ఆ సినిమా డైలాగులో మాదిరిగా.. ‘తగ్గడం’ అంటే యేంటో, యెక్కడెక్కడ తగ్గాల్నో నిన్ను జూసే యీ పెపంచికం మొత్తం నేర్చుకోవాల గాబోలు. అదేదో సినిమాలో మన నెల్లూరు రవణా రెడ్డి పాడింది నీకు గెమనముండాదా అబ్బయ్యా..? ‘జుట్టు పట్టుకుని బయటకీడ్సినా.. సూరు పట్టుకుని యేళ్లాడీ.. దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవోడికి బలే చాన్సులే..’ అంటా రాగాలుదీసి మరీ పాడినాడు గదా! అప్పుడెప్పుడో నేను సిన్నప్పుడు సినిమానే గానీ.. అచ్చంగా యిప్పుడు నువ్వుండే సీనుకు తగ్గట్టుగానే పాడినట్టు అనిపిస్తా వుండాదబ్బయ్యా..!. అంతగా నీ సేతగానితనాన్ని అగ్నానాన్ని తిట్టిపోస్తే.. అయ్యన్నీ ఆశీస్సులే అని మురిసిపోతున్నట్టుగా.. రేపోమాపో ఆ ముద్రగడ పెద్దాయన యింటికి బొయ్యి వాటేసుకోబోతండావే.. నా పార్టీలోకి రమ్మని ఎర్రతివాచీ పరచబోతావుండావే.. తగ్గడంలో మజా తెలిసిన మగానుబావుడివి అబ్బయ్యా!

స్టేజీ ఎక్కినావంటే సాలు.. సేతికి మైకు దొరికిందంటే సాలు.. దాన్సిగదరగా.. స్టేట్లో వుండే కులాల పేర్లన్నీ యేకరవు పెట్టేస్తావు. ఆల్లందరికీ రాజ్జాధికారం దక్కడం లేదంటా పెద్దపెద్ద డైలాగులు యేసేస్తావు. ఆల్లందరికీ అధికారం యిచ్చేస్తా.. అనేసి డైలాగులు కొడతావు. అక్కడికేదో సీఎం సీటు పప్పులు బెల్లాలు పంచినట్టుగా అన్ని కులాలోల్లకి పంచేస్తా అన్నట్టుగా వుంటాది నీ తమాసా! అయినా అబ్బయ్యా.. నువ్వు మోసే పల్లకీ మీద ఆ కులాల వోళ్లంతా యెక్కబోతండారా? యేందీ? సెంద్రబాబు వొక్కడే గదా? ఆ మాత్రం యింగితం నీకు లేకపోతే యెట్టా? మైకు దొరికితే వంద కులాల పేర్లు సదవతావు గానీ.. పార్టీ కాడికి, ఎలచ్చను కాడికి వొచ్చేసరికి నీకులమొక్కటే నీకు కావాల. నీ కులం ఓటు రవ్వంత కూడా సీలి పక్కకిపోకూడదనే యావ! నీ కులం ఓటు సీలిందా.. నీ రాజకీయ బతుకు సీటీ సిరిగినట్టే అని నీకు బయ్యం! అందుకే గదా.. నిన్నటిదాకా తిట్టిపోసిన పెద్దాయనకి యేం బిస్కెటు యేసినావో యేమో.. యియ్యాల పొయ్యి వాటేసుకోబోతండావు!

అబ్బయ్యా.. నువ్వో సంగతి గేపకం పెట్టుకోవాల. జనం నీ మాటలు యిని యిజిళ్లు గొడతావుండారని మురిసిపోతండావో యేందో..? లోపల్లోపల కులం కార్డు యేస్తే జనం డంగైపోతారని ఆశపడతండావో యేందో? ఆ పప్పులేం వుడికేది లే! జనం యిదివరకటిలాగా యెర్రిబాగులోళ్లు కారు అబ్బయ్యా..! శానా తెలివి మీరిపోయుండారు? కులాన్ని బట్టి గాదు.. మంచి జేసే మడిసిని బట్టి ఓట్లేస్తారు! నీకేం దిగులక్కర్లేదులే అబ్బయ్యా.. ఎలచ్చను తర్వాత గ్యాప్ లు లేకుండా షూటింగులకు కాల్షీట్లు యిచ్చేసుకో.. అప్పుటికి పూర్తిగా కాళీ అయిపోతావు గదా!
-నెల్లూరు పెద్దారెడ్డి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement