
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లను అడ్డగోలుగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. దివ్యాంగుల పట్ల చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వం మానసిక వైకల్యంతో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు.
‘దివ్యాంగుల మీద చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. వారికి పెన్షన్లు కట్ చేసి అన్యాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి మానసిక వైకల్యం ఉంది. అందుకే అడ్డగోలుగా పెన్షన్లు తొలగించారు. దేశ చరిత్రలో ఏనాడైనా ఈ స్థాయిలో పెన్షన్ల తొలగింపు జరిగిందా?, చంద్రబాబు మాత్రమే ఏకంగా లక్షకు పైగా పెన్షన్లు తొలగించి తన కర్కశత్వాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లాలో రామలింగారెడ్డి మరణం ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం.
లక్షల కోట్ల అప్పులు చేస్తూ కనీసం దివ్యాంగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేరా?, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా?, ఉన్నవాటిని కూడా తొలగించి వారి ఉసురు తీస్తున్నారు. దివ్యాంగుల్లో కూడా కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు చూసి పెన్షన్లు ఇవ్వటం ఏంటి?, నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చేవారిని చూస్తుంటే మనసుకు బాధ కలుగుతోంది. అలాంటి వారికి కూడా ఎలా పెన్షన్లు తొలగించారు?, గతంలో ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లను కాదనటం ఆ డాక్టర్లను అవమానించటం కాదా?, వికలాంగులను తీసుకుని వస్తున్న మా పార్టీ నేత ఉషశ్రీ చరణ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. మూడు హెలికాప్టర్ లలో తిరుగుతున్న ప్రభుత్వ పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా?, తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దరించకపోతే ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు.