
సాక్షి, కాకినాడ: జనసేన (Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకవైపు యువ కార్యకర్తలు రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తించగా.. ఇంకోవైపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి మరీ వాహనదారులతో వాగ్వాదానికి దిగారు మరికొందరు.
పిఠాపురం శివారు ప్రాంతమైన చిత్రాడలో ‘జయకేతనం’(JSP JayaKethanam Sabha) పేరిట సభ నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు అతి చేష్టలకు దిగాయి. ‘‘పిఠాపురం డిప్యూటీ సీఎం తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది?’’ అంటూ నినాదాలు చేస్తూ.. దారినపోయేవాళ్లను దుర్భాషలాడుతున్నారు.
ఈ క్రమంలో.. జనసేన స్టికర్లు, జెండాలతో ఉన్న బైకులు, కార్లతో రోడ్లపై హల్ చల్ చేశాయి. కత్తిపూడి-కాకినాడ 216 జాతీయ రహదారిపై జనసైనిక్స్ బైక్‌లతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో ఆ దారి గుండా వెళ్లే పలువురు వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ జనసేన నేతలు సామాన్యులకు చుక్కలు చూపించారు.
ఈ క్రమంలో చిత్రాడ వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి.. జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరాడతను. ఈలోపు వెనక నుంచి జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అతన్ని చితకబాదాడు. సదరు వ్యక్తిని బూతులు తిట్టాడు. ఆ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే పిఠాపురంలో ఎర్ర టవల్ బ్యాచ్ ఇంత చేస్తున్నా.. అక్కడి పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం
