
సాక్షి, కృష్ణాజిల్లా: పెడనలో న్యాయం కోసం జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. టీడీపీ నేతల అరాచకాలపై జనసేన పోరాట దీక్షకు దిగింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వాహనం ముందు జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ కార్యక్తలకు అన్యాయం జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరుతూ జనసేన కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పెడన నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్ ఆధ్వర్యంలో దీక్షకు దిగారు. అరగంట కేటాయిస్తే పనైపోద్ది.. మా గోడు తెలియజేయడానికి సమయం ఇవ్వాలంటూ బ్యానర్లు కట్టారు.
కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నా పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడంతో ఆయన అపాయింట్‌మెంట్ కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన సీరం సంతోష్ దీక్షతో టీడీపీ,జనసేన పార్టీలో కలవరం రేగుతోంది. జనసేన కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీక్ష విరమింపజేయాలని ప్రయత్నాలు చేస్తుండగా, సీరం సంతోష్ మాత్రం ససేమిరా అంటున్నారు.
మరో వైపు, నిన్న(బుధవారం) కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పి.గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్ పేరు పలకరా అంటూ నిరసన వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించక పోవడంతో టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. దీంతో వివాదం మరింత ముదిరింది. షాక్ తిన్న అచ్చెన్నాయుడు సభ నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment