ప్రధాని మోదీ రోడ్‌ షో, ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్స్‌? కాంగ్రెస్‌ విమర్శలు

Jairam Ramesh slams PM BengaluruRoadshow Ambulances stuck - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ఆకర్షించడానికి నేతలు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం మెగా రోడ్‌షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ రోడ్డు షో ఏకంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 26 కిలోమీటర్ల మేర సాగింది.

మోదీ ప్రచారానికి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో రోడ్లన్నీ కాషాయమయంగా మారిపోయాయి. బెంగళూరు సౌత్‌లోని సోమేశ్వర్ భవన్ ఆర్‌బీఐ గ్రౌండ్ నుంచి మల్లేశ్వరం సాంకీ ట్యాంక్  వరకు రోడ్‌షో కొనసాగింది. ఓపెన్‌ వాహనంలో కార్యకర్తలకు, అభిమానులకు  అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

కాగా ప్రధాని రోడ్డు షో సందర్భంగా బెంగుళూరు ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్‌ చిక్కుంది. ట్రాఫిక్‌లో అంబులెన్స్‌ ఇరుక్కున్న ఫోటోలను కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. బెంగుళూరులో ప్రధాని మోదీ రోడ్ షో ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా ఈ కార్యక్రమానికి మోస్తరు స్పందన వచ్చినట్లు కనిపిస్తోందని సెటైర్లు వేశారు. రోడ్‌ షో కారణంగా రహదారిపై గందరగోళం నెలకొందని, రోడ్డుపై అంబులెన్స్‌ చిక్కుకుపోయిందని తెలిపారు. బెంగళూరు ప్రజల పట్ల ప్రధానమంత్రికి కొంచెమైనా బాధ్యత ఉంటే ఆదివారం నిర్వహించబోయే రెండో రోడ్‌ షోను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా, అంతకుముందు మే 6న 10 కిలోమీటర్లు, 7న 26 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. అయితే ఆదివారం నీట్ పరీక్ష  ఉన్నందున మోదీ రోడ్ షో షెడ్యూల్‌లో పలు మార్పులు చేశారు. శనివారమే 26 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహిస్తుండగా.. ఆదివారం తిప్పసంద్రలోని కెంపె గౌడ విగ్రహం నుంచి ట్రినిటీ  సర్కిల్‌ వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటలకు పూర్తి చెయ్యనున్నారు. మరోవైపు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బెంగళూరు దక్షిణ ప్రాంతాలు, శివాజీనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు.
చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top