సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా.. రాక్షసుల కంటే దారుణంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాల చేతుల్లో కిరాతకంగా హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ కేసుపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
ఏపీలో ఊర్లు విడిచిపెట్టే పరిస్థితికి రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఊరిలో తిరిగి అడుగుపెట్టడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అంతలా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు దగ్గరుండి ప్రొత్సహిస్తున్నారు. సాల్మన్ ఒక దళితుడు.. ఒక సామాన్యుడు. తన భార్య అనారోగ్యం బారిన పడిందని సొంత గ్రామం పిన్నెల్లి వెళ్తే.. రాడ్లతో కొట్టి చంపేశారు.
చికిత్స పొందుతూ ఆ మనిషి చనిపోతే.. కనీసం మృతదేహాన్ని ఊరిలోకి కూడా రానివ్వలేదు. మా పార్టీ నేతలు పోరాడితేగానీ అంత్యక్రియలకు అనుమతించలేదు. తన పాలనలో చంద్రబాబు విషపు గింజలు నాటాడు. చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తి ఆయన. ఈ ఘటనలో.. సీఐ, ఎస్సైలు, ఎస్సీ, ఎమ్మెల్యే, చంద్రబాబు కూడా దోషే. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు. ఇది ఆయన గుర్తిస్తే మంచిది. పిన్నెల్లి ఉదంతంపై కోర్టులను.. మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తాం అని వైఎస్ జగన్ అన్నారు.


