నీ లెక్క అధిష్టానం దగ్గర తేల్చుకుంటా | Internal Fight In Etcherla TDP Leaders | Sakshi
Sakshi News home page

నీ లెక్క అధిష్టానం దగ్గర తేల్చుకుంటా

Oct 24 2026 12:36 PM | Updated on Oct 24 2026 12:45 PM

Internal Fight In Etcherla TDP Leaders

రణస్థలంలో బహిరంగ ప్రదేశంలో ఎంపీపై విసుక్కుంటూ వస్తున్న చౌదరి బాజ్జి

సాక్షి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల టీడీపీలో స్థానిక ముసలం ముదిరి పాకాన పడింది. రణస్థలం మండల కేంద్రంలోని ఒక బహిరంగ ప్రదేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామ్‌ సమక్షంలో ఎచ్చెర్ల మండల టీడీపీ శ్రేణుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఎచ్చెర్ల జెడ్పీటీసీ స్థానం అన్‌ రిజర్వ్‌డ్‌ జనరల్‌కు కేటాయించారు. దీంతో ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌.ఎం.పురం గ్రామానికి చెందిన చౌదరి నారాయణమూర్తి (బాజ్జి) జెడ్పీటీసీగా పోటీ చేస్తానని, జెడ్పీ చైర్మన్‌ రేసులో నిలబడతానని ఈ స్థానం మరొకరికి కేటాయించ వద్దని రిజర్వేషన్లు ఖరారైనప్పడే విన్నించారు.   

కానీ ఎచ్చెర్ల మండలంలో ఒక్క శుక్రవారమే గుంప గుత్తగా నామినేషన్లు పడ్డాయి. తొలి నుంచి జెడ్పీటీసీని ఆశిస్తున్న జనసేన నాయకుడు విశ్వక్సేన్, ఎస్‌ఎం.పురం మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి భర్త చౌదరి బాజ్జి నామినేషన్‌ వేశారు. ఈ లోగా ఎంపీపీ రేసులో ఉన్న టీడీపీ నాయకులు కూ డా హుటాహుటిన జెడ్పీటీసీ నామినేషన్లు వేశారు. ఎస్‌.ఎస్‌.ఆర్‌ పురం గ్రామానికి చెందిన గాలి వెంకటరెడ్డి, ఫరీదుపేట గ్రామానికి చెందిన పైడి ముఖలింగం, తమ్మినాయుడుపేట గ్రామానికి చెందిన వావిలిపల్లి రామకృష్ణలు జెడ్పీటీసీగా శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు.

ఒకరు జనసేన, నలుగురు టీడీపీ నాయకులు నామినేషన్లు దాఖలు చేయ డం మండల టీడీపీ శ్రేణుల్లో సంచలనమైంది. జనసేన తరఫున విశ్వక్సేన్‌ జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసినా.. అతడి ఓటు శ్రీకాకుళం మున్సిపాలిటీలో కోర్టు పెండింగ్‌లో ఉన్న తోటపాలెం గ్రామంలో ఉంది. దీంతో తోటపాలెం గ్రామం నుంచి ఓటును ఇటీవల పొన్నాడకు బదిలీ చేశారు. దీనిపై ఓటు అర్హత పొందుతుందా లేదా అనే సందిగ్ధంలో మండల వాసులు ఉన్నారు. ఈ లోగా ఓటు విషయంపై విశ్వక్సేన్‌ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాను, అనుకూలంగా తీర్పు వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.  

ఎంపీ రాజకీయ క్రీడలో బలైన బాజ్జి 
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదేశాలతోనే కొందరు నామినేషన్‌ వేసిన సంగతి బహిర్గతమైంది. ఈ విషయం ఎచ్చెర్ల టీడీపీ శ్రేణుల్లో దావానంలా పా కింది. దీంతో ఎచ్చెర్ల మండలానికి చెందిన టీడీపీ శ్రేణులంతా రణస్థలంలో ఎంపీని కలిసేందుకు కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ అంతా బహిర్గతమవుతుందని ఆలోచించిన ఎంపీ అక్కడికి కొంత దూరంలోని బహిరంగ ప్రదేశానికి వెళ్లారు. 

అక్కడ ఎచ్చెర్ల పార్టీ శ్రేణులంతా చేరుకున్నాక చౌదరి బాజ్జి ఆగ్రహంతో ఎంపీ అప్పలనాయుడుపై చిందులేశారు. ‘మీకు చెప్పినదేమిటి మీరు చేసేందేమిటి..’ అంటూ ఏక పదజాలంతో విరుచుకుపడినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ‘మా ఎచ్చెర్ల మండలంలో మా టీడీపీలో మాకు గొడవలు పెడతారా’ అంటూ నిలదీశారు. ‘నేను ఒక్కడినే జెడ్పీటీసీగా పోటీ చేస్తానంటే మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇదంతా నీ రాజకీయ కుతంత్రమేనా’ అంటూ చిందులేసి రచ్చరచ్చ చేసినట్లు అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఒకానొక దశలో నీ స్థాయి, నీ సంగతి అంటూ పైపైకి వెళ్లినట్లు సమాచారం. 

‘నీ లెక్క అధిష్టానం దగ్గర తేల్చుకుంటా..’ అంటూ చౌదరి బాజ్జి కారెక్కి వెళ్లిపోయారు. ఈ మధ్యలో ఎచ్చెర్ల మండలంలోని ఎచ్చెర్ల సర్పంచ్‌కు ఇద్దరు టీడీపీకి చెందిన నాయకులు మెండ రాజారావు, జరుగుళ్ల వెంకట రమణమూర్తి వర్గాల మధ్య పంచాయతీపై పోటీపై కూడా రచ్చ జరిగింది. అలాగే ఎచ్చెర్ల ఎంపీపీ అభ్యర్థిని తేల్చడంలో ఎంపీ తీవ్ర జాప్యం చేపడం పట్ల ఎంపీపీని ఆశించే ఆశావాహుల్లో ఒకరు ఎంపీని నిలదీశారు.  

ఇదీ చదవండి: కూటమి ఏది.. జన సైనికులను చితక్కొట్టారు: అంబటి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement