కొమ్మినేని సురేష్, మాదాల సత్యవతి
గుణదల(విజయవాడ తూర్పు): పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారంలో ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఇద్దరు నాయకులను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. సేకరించిన వివరాల ప్రకారం, గుణదల 1వ డివిజన్‌లో టీడీపీకి చెందిన కొమ్మినేని సురేష్ మాదాల సత్యవతి ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశంపార్టీకి సేవలందించారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వీరిద్దరికీ సముచిత స్థానం ఇవ్వలేదన్న కారణంగా వారు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులను దూషిస్తూ, పార్టీ నియమాలను అతిక్రమించారు.
దీంతో విషయం తెలుసుకున్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వారిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై టీడీపీలో వీరిద్దరికీ స్థానం లేదని, పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోకూడదని, సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ సెంట్రల్ కార్యాలయం అధికారికంగా లేఖను విడుదల చేసింది. ఎంతో కాలంగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తమను సస్పెండ్ చేయడంపై వారిద్దరూ తీవ్ర అసహనానికి గురయ్యారు. తమకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యేలా.. మజాకా! జెడ్పీ చైర్మన్ సీటు రూ.50 కోట్లు!


