Sakshi News home page

Rahul Gandhi: ఐక్యంగానే పోరాడతాం

Published Fri, Jan 26 2024 6:12 AM

INDIA bloc will fight injustice unitedly says Rahul Gandhi - Sakshi

కూచ్‌ బెహార్‌(పశ్చిమ బెంగాల్‌): దేశవ్యాప్తంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి ఐక్యమత్యంగానే దేశవ్యాప్తంగా అన్యాయంపై పోరాటం కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. పశ్చిమబెంగాల్‌లో ఒంటరిగానే బరిలో దిగుతామని తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ ప్రకటించిన వేళ రాహుల్‌ కూటమి ఐక్యతపై మరోసారి స్పష్టతనివ్వడం గమనార్హం.

అస్సాంలో గువాహటి నగరంలోకి భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకోవడం, కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసుల ఘర్షణల నడుమ అస్సాంలో ఉద్రిక్తంగా కొనసాగిన యాత్ర గురువారం పశ్చిమబెంగాల్‌లోకి అడుగుపెట్టింది. బక్షీర్‌హాట్‌ గుండా రాష్ట్రంలోని కూచ్‌ బెహార్‌ జిల్లాలో రాహుల్‌ యాత్రను మొదలుపెట్టి అక్కడ మద్దతు దారులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశంలో అన్యాయం రాజ్యమేలు తున్నందుకే యాత్రకు న్యాయ్‌ అనే పదం జతచేశాం’’ అని అన్నారు.  మరోవైపు బెంగాల్‌లో యాత్రలో సీపీఎం, వామపక్ష పార్టీలు పాలుపంచుకునే అవకాశం ఉంది.

బస్సులో ఉన్నది రాహుల్‌ కాదేమో: అస్సాం సీఎం హిమంత
అస్సాంలో న్యాయ్‌ యాత్ర సందర్భంగా బస్సు లోపలి వైపు రాహుల్‌ సేదతీరుతూ ముందువైపు డూప్‌ను కూర్చోబెట్టి యాత్ర చుట్టేస్తు న్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ‘‘అస్సాంలో న్యాయ్‌ యాత్ర ప్రభావం శూన్యం. యాత్ర కొనసాగిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీనే విజయం సాధిస్తుంది. రాహుల్‌ ప్రచారం చేసిన చోటల్లా బీజేపీనే గెలుస్తుంది. ఆ కోణంలో చూస్తే బీజేపీకి రాహుల్‌ అవసరం ఎంతైనా ఉంది’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. కొన్ని చోట్ల రాహుల్‌ అస్సలు బస్సు దిగట్లేరని, బస్సులో ముందువైపు కనిపించేది రాహుల్‌ కాదని కొన్ని మీడియాకథనాలు వచ్చాయన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement