రాజ్యాంగం గురించి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తాం.. కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి వార్నింగ్‌

Hyderabad: Pcc Chief Revanth Reddy Slams Cm Kcr Over Constitution Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యల విషయంలో కేసీఆర్‌ పాత్రధారి అయితే మోదీ సూత్రధారి అని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ పేరుతో గాంధీభవన్‌లో చేపట్టిన రెండు రోజుల దీక్షను శుక్రవారం ఆయన విరమింపజేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ నాగరిగారి ప్రీతం, అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్, ఓబీసీ సెల్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌కు ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ రాజీవ్‌ లిలోతియాతో కలసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ.. దేశాన్ని పాలిస్తున్న మోదీకి పుతిన్, జిన్‌పింగ్‌లు ఆదర్శమని చెప్పారు. 68 ఏళ్లకు రిటైర్‌ కావాలని, రెండుసార్ల కంటే ఎక్కువ అధ్యక్షుడిగా పోటీ చేయకూడదన్న నిబంధనలను మార్చి తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకునేందుకు జిన్‌పింగ్‌ చైనా రాజ్యాంగాన్ని సవరించారని, అలాగే 2036 వరకు అధ్యక్షునిగా ఉండేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రాజ్యాంగాన్ని సవరించుకున్నారని.. ఇప్పుడు మోదీ కూడా అందుకే రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారని చెప్పారు. 

కేసీఆర్‌.. ఓ కిమ్‌జోంగ్‌ ఉన్‌.. 
రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్‌కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదర్శమని పేర్కొన్నారు. కేసీఆర్‌ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం అన్ని జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్లలో ఆయనతోపాటు టీఆర్‌ఎస్‌ నేతలపై ఫిర్యాదులు చేయాలన్నారు. ఆదివారం రాష్ట్రంలోని అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని సూచించారు. సోనియా, రాహుల్‌తో మాట్లాడి పార్లమెంట్‌ ఎదుట రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలం దీక్ష చేసి నిరసన తెలుపుతామని చెప్పిన రేవంత్‌.. రాజ్యాంగం గురించి ఇంకోసారి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తామని, ప్రగతిభవన్‌లో ఇటుక ఇటుక పీకేస్తామని హెచ్చరించారు.  

సీఎంవి ప్రమాదకర వ్యాఖ్యలు.. 
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం గురించి ఇంతటి ప్రమాదకరమైన వ్యాఖ్యలను ఎవరూ చేయలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజ్యాంగమంటే కేవలం దళితులు, గిరిజనుల రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదని, రాజ్యాంగం లేకపోతే రాజులు, రాజ్యాలు మాత్రమే ఉండేవ ని చెప్పారు. రాజ్యాంగం పనికిరాదని చెప్పి నసీఎంను తొలగిస్తే తప్ప రాజ్యాంగానికి గౌరవం దక్కదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నేతలు షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, గీతారెడ్డి, వి.హనుమంతరావు, అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top