
సాక్షి, కృష్ణాజిల్లా: గుడివాడ 8వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. కుప్పానికే పరిమితమైన చంద్రబాబు ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను పిలిపించుకుని నానా అల్లరి చేస్తున్నాడని మండిపడ్డారు. ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గంలో కూడా చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోందన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు ఆఖరికి కుప్పంలో పోరాడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమితో రాష్ట్రంతో పాటు, కుప్పంలో కూడా చంద్రబాబు పీడ విరగడ అవుతుందన్నారు. కుప్పంలో అడ్రస్, ఓటర్ కార్డులేని చంద్రబాబు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఏ రకంగా సవాల్ విసురుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ కకావికలం కాక తప్పదన్నారు. ఎవరికోసమో, ఎవరో అడిగారనో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు.
చదవండి: (చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని)