ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు ఆత్మగౌరవం లేదు 

Gudivada Amarnath Comments On Uttarandra TDP Leaders - Sakshi

వాళ్లు ఒక్క అమరావతి అభివృద్ధినే కోరుకుంటున్నారు 

ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు 

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌  

సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు ఉత్తరాంధ్రమనోభావాలను దెబ్బ తీస్తున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో పుట్టిన టీడీపీ నేతలకు ఆత్మగౌరవం లేదని, వారు అదే తీరులో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వారు కట్టుబడి లేరన్నారు.

ఉత్తరాంధ్రకు ఏ పరిశ్రమా అవసరం లేదని, రాజధాని కూడా వద్దని, ప్రభుత్వం పెట్టాల్సిన రూ.లక్షల కోట్లు కేవలం అమరావతిలోనే పెట్టండని, ఆ అప్పునంతా అందరితో కలిసి తీరుస్తామని ఉత్తరాంధ్ర టీడీపీ బంట్రోతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆ సమావేశంలో మేధావులు ఎవరూ అమరావతిని వ్యతిరేకించలేదని చెప్పారు. అమరావతితో పాటు, విశాఖ, కర్నూలును కూడా రాజధానులుగా అభివృద్ధి చేయాలని కోరారన్నారు. అక్కడి ప్రజలకు ఆత్మగౌవరం ఉన్నట్టే ఉత్తరాంధ్ర వారికీ ఉంటుందని చెప్పారు. ఎప్పుడూ ఉత్తరాంధ్ర నష్టపోతూనే ఉందన్నారు.

హైదరాబాద్‌ను కోల్పోయిన తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. సీఎం నిర్ణయానికి అందరి మద్దతు ఉందని, వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు.

ఎందుకు రెచ్చగొడుతున్నారు?
అమరావతి రైతుల పేరుతో జరుగుతున్న పాదయాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు. కానీ, కార్లు ఎక్కి తొడలు కొట్టమని, చెప్పులు చూపించమని కోర్టు చెప్పిందా అని ప్రశ్నించారు. ఎవరిని రెచ్చగొట్టడానికి ఆ పని చేస్తున్నారని అన్నారు. పాదయాత్ర చేస్తున్నారా లేక తొడల యాత్ర చేస్తున్నారా అని నిలదీశారు.

ప్రజల మధ్య నడుస్తూ విద్వేషాలు రెచ్చగొట్టొద్దని చెప్పారు. రాజకీయ అజెండాతో జరుగుతున్న క్యాపిటలిస్ట్‌ ఉద్యమంలో ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అన్నారు. మీరు ఎంత రెచ్చగొడుతున్నా.. సంయమనం పాటించాలని ఉత్తరాంధ్రవాసులను కోరుతున్నామన్నారు. పాదయాత్రను నిజంగా అడ్డుకోవాలనుకొంటే ప్రభుత్వానికి ఎంతసేపని అన్నారు.

విశాఖపట్నంలో అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్నప్పుడే గంజాయి సాగు ఎక్కువగా జరిగిందని, వాళ్లు దానిపైనే బతికారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు బూట్లు నాకే పని మానేయాలని టీడీపీ నేతలకు చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top