‘కారు’లోనే సీమాంధ్రుల ప్రయాణం

GHMC Elections 2020 Settlers Vote Against TRS - Sakshi

మొగ్గు చూపని ఉత్తరాది, దక్షిణ తెలంగాణ వారు

టెకీల ఓటు అత్యధికంగా టీఆర్‌ఎస్‌ పార్టీ వారికే

సాక్షి, హైదరాబాద్ ‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు కీలకాంశాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికీ సీమాంధ్రకు చెందిన వారిలో అత్యధికులు ‘కారు’తోనే ప్రయాణిస్తున్నారని స్పష్టమైంది. అయితే ఉత్తరాది నుంచి వలసవచ్చిన, దక్షిణ తెలంగాణకు చెందిన ‘సెటిలర్స్‌’తీర్పు మాత్రం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉంది. సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన వాళ్ళల్లో అత్యధికులు అభివృద్ధికే జై కొడుతూ టీఆర్‌ఎస్‌కే ఓటు వేసినట్లు ఈ ఫలితాలు పునరుద్ఘాటించాయి. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు టీఆర్‌ఎస్‌కే మద్దతు పలికారు. అలాగే ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పట్టం కట్టారు. ఫలితంగానే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ భారీగా సీట్లు దక్కించుకుంది. ఈ ఏరియాల్లో స్థిరపడిన వారిలో రాయలసీమ, దక్షిణాంధ్రతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ తమను అక్కున చేర్చుకున్న టీఆర్‌ఎస్‌తోనే కలసి నడుస్తున్నారు. ఫలితంగా శేరిలింగంపల్లిలో అత్య ధిక సీట్లు రాగా.. కూకట్‌పల్లిని టీఆర్‌ఎస్‌ స్వీప్‌ చేసింది.

ఉత్తరాది వారు బీజేపీతోనే..
ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు మాత్రం బీజేపీకి జై కొట్టారు. ఈ కారణంగానే కోర్‌ సిటీలోని అనేక ప్రాంతాలతో పాటు ఉత్తరాది వారు స్థిరపడిన గోషామహాల్, గన్‌ఫౌండ్రి, బేగంబజార్, జియాగూడ, హిమాయత్‌నగర్‌ తదితర డివిజన్లలో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మంత్రి జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌ తది తరులు వీరిని ప్రభావితం చేయ గలిగారు. దక్షిణ తెలంగాణ వాసులు ఎక్కువగా నివసిం చే ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతా ల్లోనూ ఈ సారి టీఆర్‌ఎస్‌ పార్టీ తన మార్కు చూపించ లేకపోయింది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు కాస్త పట్టు తక్కువగా ఉంది. ఇక గతంలో పోలిస్తే ఈసారి టెకీలు అతి తక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారందరూ అభివృద్ధికి పట్టం కడుతూ అధికార పార్టీకి జై కొట్టారు. ఈ కారణంగానే ఐటీ జోన్‌లో ఉన్న డివిజన్లలో ఒక్క గచ్చిబౌలి మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top