అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా? | Errabelli Swarna, Varada Rajeswara Rao Will Say Goodbye To Congress | Sakshi
Sakshi News home page

రాజీనామాకు సిద్ధమైన మాజీ మేయర్‌ దంపతులు?

Apr 23 2021 8:27 AM | Updated on Apr 23 2021 8:27 AM

Errabelli Swarna, Varada Rajeswara Rao Will Say Goodbye To Congress - Sakshi

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల వేళ తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరిచారని, ఇంకా ఎంతోకాలం ఈ అవమానాలను భరించలేమని ముఖ్య కార్యకర్తలతో స్వర్ణ – వరదరాజేశ్వర్‌రావు దంపతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : కాంగ్రెస్‌ పార్టీలో చాప కిందినీరులా సాగుతున్న అసంతృప్తి గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా తారాస్థాయికి చేరింది. బీ ఫాంల కేటాయింపులో సమన్యాయం జరగలేదంటూ కొందరు సీనియర్‌ నాయకులు మనస్తాపానికి గురవుతున్నారు. కొంతకాలంగా తమను పార్టీకి దూరం చేసేందుకు సాగుతున్న కుట్రలను వివరించినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో కలత చెందిన మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వర్‌రావు దంపతులు పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల సందర్భంగా తాము సూచించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై మనస్థాపం చెందిన వారు ‘పార్టీలో ఉందామా? రాజీనామా చేద్దామా?’ అని గురువారం ముఖ్య కార్యకర్తలతో సమాలోచనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న తమను బయటకు పంపే కుట్ర సాగుతుందన్న వ్యాఖ్యలతో.. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలు సూచించినట్లు తెలిసింది.

ఇంకెంతో కాలం భరించలేం...
గత నలభై ఏళ్లుగా వరద రాజేశ్వర్‌రావు, స్వర్ణ దంపతులు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వీరిలో స్వర్ణ నగర మేయర్‌గా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల సందర్భంగా తమను పట్టించుకోకుండా అవమానించారని వారు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. నగర మేయర్‌గా ఐదేళ్లు పనిచేసిన స్వర్ణ 2014 ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, పార్టీ సభ్యత్య నమోదు కూడా ఇక్కడి నుంచే చేయించుకున్నారు. అయినా వర్ధన్నపేట నుంచి పీసీసీ సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. అప్పట్లో శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో వర్ధన్నపేట నుంచి మార్చి సంబంధం లేని వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి సభ్యురాలిగా నియమించినట్లు వెల్ల డించారు. అయితే దీనివెనుక జిల్లా, రాష్ట్ర నేతల కుట్ర దాగి ఉందని వరద రాజేశ్వర్‌ దంపతుల అనుచరులు అప్పట్లో విమర్శలు చేశారు.

వరంగల్‌ పశ్చిమ నుంచి వచ్చే ఎన్నికల్లో తమ నేతలకు అవకాశం ఇవ్వకుండా చేసే ముందస్తు ప్రణాళికలో భాగమే ఈ కుట్ర చేశారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల వేళ తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరిచారని, ఇంకా ఎంతోకాలం ఈ అవమానాలను భరించలేమని ముఖ్య కార్యకర్తలతో స్వర్ణ – వరదరాజేశ్వర్‌రావు దంపతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో ఉంటూ ఆత్మగౌరవ పోరాటం చేయడమా, లేక పార్టీ నుంచి తప్పుకోవడమా అన్న కోణంలో వారు ముఖ్య అనుచరులతో చర్చలు చేస్తున్నారు. హన్మకొండలోని స్వగహంలో గురువారం కార్యకర్తలతో సమావేశమైన వారు రాత్రి పొద్దుపోయే వరకు సమాలోచనలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.  

చదవండి: నామినేషన్లు ముగిశాయి.. ఇక ప్రచారమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement