నా తోబుట్టువు సుజాత అక్కని గెలిపిద్దాం: హరీష్‌ రావు

Dubbaka Bypolls: Harish Rao Participated In Election Campaign - Sakshi

సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా హసన్మీరాపూర్‌లో మంత్రి హరీష్‌ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. కష్టం, సుఖం, ఆపదలో ఎప్పటికి ఉంటాను. మీ కోసం నా తలుపులు ఎప్పటికి తెరచి ఉంటాయి. ఈ ఎన్నికలు సోలిపేట లింగన్న మరణంతో వచ్చాయి. నా తోబుట్టువు సుజాత అక్కని గెలిపిద్దాం. పట్టుబట్టి రమ్మని పిలిస్తే కలసి దండం పెట్టి పోదామని వచ్చాను. ఈ గ్రామంలో సీఎం కేసీఆర్ 15 రోజులు ఇక్కడే ఉండి రోడ్డు వేయించి బస్సు తెప్పించారు. మీరు కోరిన విధంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేశారు.

ఇప్పుడు నేను హసన్మీర్, అప్పనపల్లికి రోడ్డు వేయిస్తాను. ఎస్సీ, బీసీ కాలనీలలో సీసీ రోడ్లు, మోరీలు, ఖాళీ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం కోసం నిధులు ఇస్తాను. ఇంటి అడుగు జాగాలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం అసెంబ్లీలో ఆమోదం కూడా వచ్చింది. మీ గ్రామానికి 50 డబుల్ బెడ్ రూమ్స్ మంజూరు చేస్తాను. కరోనాతో కొంత ఇబ్బంది అయింది. ఆదాయం తగ్గింది. ఇలాంటి కష్టసమయంలో కూడా ఉచితంగా రేషన్‌, పప్పులు, సరుకులు పంపిణీ చేశాం. గ్రామంలో 182 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. పేదింటి ఆడపడచు పెళ్లికి లక్ష పదహారు రూపాయలు ఇస్తున్నాం. బీడీ పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు పెట్టు బడి ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇందులో బీజేపీ, కాంగ్రెస్‌వి ఒక్క పైసా కూడా లేదు. గ్రామంలో ముదిరాజ్‌, యాదవ సంఘాల భవనాలు నిర్మిస్తాం, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హరీష్‌ రావు తెలిపారు.  (‘సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top