‘కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా’

Dubbaka By Polls: Harish Rao, Solipeta Sujatha Comments  - Sakshi

సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి హారీష్‌ రావు ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ ఎంతో పాటు పడిందని చెప్పిన మంత్రి కాంగ్రెస్‌ బీజేపీపై మండిపడ్డారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ మోసం చేసింది నిజం కాదా అని మంత్రి హారీష్‌ రావు ప్రశ్నించారు. ఆనాడు విద్యార్థి మిత్రుల చావులకు ఈ కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీశారు. తొగుల మండల కేంద్రంలో మంగళవారం యువజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, పెద్ద సంఖ్యలో యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. రాదనుకున్న తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు. డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ వెనక్కి పోతే తామంతా రాజీనామా చేస్తే, బీజేపీ కిషన్ రెడ్డి రాజీనామా చేశాడా అని ప్రశ్నించారు. చదవండి: బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ

నీళ్లు, నిధులు, నియమకాలు టీఆర్‌ఎస్‌ నినాదమని, ఈ రోజు కాళేశ్వరం ద్వారా సాగు నీరు తెచ్చుకుంటున్నామన్నారు. మన నిధులు దక్కాయి కాబట్టే రైతు బంధు, రైతు బీమా, వచ్చాయన్నారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు అని చెప్పామని, 1,24,990 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ పారిశ్రామిక విధానంతో 8 వేల పరిశ్రమలు వచ్చాయని పేర్కొన్నారు. బీజేపీ వస్తే నల్లధనం తెస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15 లక్షలు వేస్తామన్నారు. వచ్చాయా అని ప్రశ్నించారు. వారు వస్తే ఏటా కోటి ఉద్యోగాలన్నారు. మరి ఇచ్చారా అని ప్రశ్నించారు. డీమానిటైజేషన్‌తో ఉన్న ఉద్యోగాలు ఊడబీకారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో అర్వింద్ కుమార్ తాను గెలిస్తే... పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడని, వచ్చిందా పసుపు బోర్డు అని నిలదీశారు. చదవండి: సీపీని సస్పెండ్‌ చేయాలి: బండి సంజయ్‌

‘బీహార్‌లో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ ఉంటేనే అభివృద్ధి జరుగుతదని మోడీ అంటున్నాడు. గట్లనే హైదరాబాద్‌లో కారు ఉంది. దుబ్బాకలో కూడా కారు ఉంటే అభివృద్ధి జరుగుతది. ముత్యంరెడ్డి బాగా అభివృద్ధి చేశాడని అంటున్న కాంగ్రెస్, 2018లో ఎందుకు టిక్కెట్టు ఇవ్వలేదు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు, టిఆర్ఎస్ అంటే 24 గంటల కరెంట్. కన్న తండ్రి క్షోభకు కారణమైన శ్రీనివాస్ రెడ్ది, ప్రజలకేం సేవ చేస్తాడు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు రావాల్సిన ప్రతి పైసా ఇప్పిస్తాం. ఆలస్యం కావడానికి కాంగ్రెస్ కేసులు వేయడమే. దేశంలో బీహార్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో కంటే నిరుద్యోగిత సగానికి సగం తక్కువ. తెలంగాణలో కేవలం 3.6 శాతమే. బీజేపీ కుడితులో పడ్డ ఎలుకల మారింది.. డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.’ అని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. చదవండి: 'అల్లుడిని ముందు పెట్టి కేసీఆర్ నడిపిస్తున్నారు'

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌‌ గెలిచేది ఖాయమని ఎంపీ ప్రబావకర్‌రెడ్డి తెలిపారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌లు వెంటిలేటర్ మీద ఉన్నాయి. దుబ్బాకకు ఎప్పుడైనా కిషన్ రెడ్ది వచ్చారా. నిన్నటి నుంచి బీజేపీ కొత్త నాటకం మొదలు పెట్టింది. పైసలు పట్టుకుంటున్నారు. ఇంకా పంపించాలని అమిత్‌షాను అడుగుతున్నరు. ఆరడుగుల పిచ్చోడు ఇష్టమైనట్లు మాట్లాడుతున్నారు. స్టాంప్ పేపర్ మీద హామీ ఇచ్చి, రైతులను మోసం చేసిన ఘనత ఎంపీ అర్వింద్‌ది. అయ్యా టీఆర్‌ఎస్‌లో ఉండి బీజేపీలో ఉన్న కొడుకుకు సపోర్ట్ చేస్తున్నాడు. ప్రజలను మోసం చేసిన ఇద్దరు కూడా రాజీనామా చేయాలి’ అని తెలిపారు.

దివంగత సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకకు ఎన్నో సేవలు అందించారని టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత అన్నారు, దుబ్బాకను ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సిద్దిపేట వారికి దుబ్బాకతో పని లేదు కానీ,  రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ లీడర్లకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. సీఎం కేసీఆఆర్‌కు ముఖ్యమైన నియోజకవర్గం దుబ్బాక అని, సీఎం ఆశీస్సులతో, హరీశ్ రావు సహకారంతో దుబ్బాకలో అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు, అన్ని చేయగల సమర్థత ఉందని స్పష్టం చేశారు. కన్నతల్లి లాగా నియోజకవర్గ యువతను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top