
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ మంగళవారం కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి చర్చే లేదని అన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ఆదేశించారు. డి.కె.శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హెచ్.ఎ.ఇక్బాల్ హుస్సేన్‌కు నోటీసు ఇస్తామని, ఆయన వివరణ కోరుతామని వెల్లడించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. సీఎం మార్పును ఇప్పుడు ఎవరూ కోరుకోవడం లేదని, తమ దృష్టి మొత్తం 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని శివకుమార్ తేల్చిచెప్పారు. తన గురించి ఇతరులు మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. అలాంటి అంశాలపై ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని పేర్కొన్నారు.