ధరల మంటపై వాగ్యుద్ధం.. రాజ్యసభలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య వాడీవేడి చర్చ

Debate between TRS and BJP in Rajya Sabha - Sakshi

కేంద్ర ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ వెన్నుదన్నుగా ఉన్నా రాష్ట్ర రుణాలపై పరిమితులు విధిస్తున్నారు: ఎంపీ సురేష్‌రెడ్డి

ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఎంపీ కె.లక్ష్మణ్‌ 

రవాణా చార్జీలు, స్టాంపు డ్యూటీలు పెంచింది టీఆర్‌ఎస్‌ అంటూ ఎదురుదాడి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిత్యావసర ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చ అధికార బీజేపీ, విపక్ష టీఆర్‌ఎస్‌ మధ్య మంటలు రాజేసింది. కేంద్రం తీరును టీఆర్‌ఎస్‌ తప్పుపడితే రాష్ట్ర ప్రభుత్వ తీరును బీజేపీ ఎండగట్టడంతో మాటలయుద్ధం జరిగింది. ధరల అంశంపై ముందుగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి మాట్లాడారు. ‘అమృత్‌మహోత్సవ్‌ నిర్వహిస్తున్న ప్రస్తుత సమయంలో దేశ ప్రజలు పేదరికం, ధరల పెరుగుదల అనే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత సెప్టెంబర్‌ నుంచి  ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఆహార ధరల ద్రవ్యోల్బణ సూచీని గమనిస్తే అది 0.68 శాతం నుంచి 8.38శాతానికి పెరిగింది.

వేరుశనగా ధరల పెరుగుదలకు ఉక్రెయిన్‌–రష్యా యుద్ధాన్ని సాకుగా చూపుతున్నారు. యుధ్దం మొదలవ్వకముందే ధరలు పెరగడం మొదలైంది’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ‘పెట్రో ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం వ్యవసాయ సెస్‌ పేరుతో లీటర్‌పై రూ.2.50 వసూలు చేస్తోంది. ఈ సెస్‌ను ఎక్కడ ఎంత మేర కేటాయించారో చెప్పలేదు. గత ఏడేళ్లలో రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. కానీ సెస్‌ వసూలు చేస్తున్నారు’ అని విమర్శించారు. ఇదే సమయంలో తెలంగాణ పరిస్థితిని వివరించారు. ‘2014కు ముందు దేశంలోనే తెలంగాణ వెనుకబడిన ప్రాంతం. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ రుణాలపై పరిమితులు విధిస్తోంది. కేంద్రం తీరు తెలంగాణ అభివృధ్ధిపై దుష్ప్రభావం చూపుతోంది’ అని అన్నారు. 

కాళేశ్వరంపై రూ.80వేల కోట్ల ఖర్చు చేస్తే ఫలితమేదీ: కె.లక్ష్మణ్‌
అనంతరం మాట్లాడిన కె.లక్ష్మణ్‌.. సురేశ్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. ‘కరోనాతో యావత్‌ ప్రపంచమే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఉంది. టీఆర్‌ఎస్‌కు ధరల పెరుగుదలపై మాట్లాడే నైతిక హక్కు లేదు. పెట్రోల్‌ ధరలను కేంద్రం రెండుసార్లు తగ్గించింది. అయితే తెలంగాణలో వ్యాట్‌ పెంచలేదంటూ ప్రభుత్వం బాహాటంగా ప్రకటించుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.35, డీజిల్‌పై రూ.27 వసూలు చేస్తోంది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రూ.70వేల కోట్లు వసూలు చేసింది. రాష్ట్రంలో ఐదు నెలల్లో భూముల విలువను రెండుసార్లు పెంచారు.

స్టాంపు డ్యూటీలను 6 నుంచి 7.50శాతానికి పెంచారు. బస్సు టిక్కెట్లను యాభై శాతం పెంచి ప్రయాణికుల నుంచి ప్రభుత్వం రూ.5,593 కోట్లు వసూలు చేసింది. మిగులు బడ్జెట్‌ అని చెప్పే రాష్ట్రం ఇప్పుడు రూ.3.50లక్షల కోట్ల అప్పులు చేసింది’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కొందరు అభ్యంతరం చెప్పారు. లక్ష్మణ్‌ కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ ‘కాళేశ్వరం నిర్మాణ వ్యయాన్ని రూ.30వేల కోట్ల నుంచి రీడిజైన్‌ పేరిట రూ.1.25లక్షల కోట్లకు పెంచారు. ఇప్పటికే రూ.80వేల కోట్లు ఖర్చు చేసినా రూపాయి ఫలితం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో బీజేపీ ఎంపీలు ‘షేమ్‌..షేమ్‌’ అంటూ నినాదాలు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top