మతకల్లోలాలకు బీజేపీ కుట్ర

CPM Leader Srinivasarao Comments On BJP - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ అడ్డుకోవాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

అనంతపురం అర్బన్‌: రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ బీజేపీ చర్యలను అడ్డుకోవాలని కోరారు. ఆయన మంగళవారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. మతసామరస్యానికి నిలయమైన రాష్ట్రంలో మతవిద్వేషాలు రగిలించేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఒక వర్గంపై బీజేపీ వారే తొలుత దాడిచేశారన్నారు. గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చకపోతే కూల్చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు.

ఈ ఘటనల్లో హిందువులను బీజేపీ ఉద్రిక్తతకు గురిచేస్తోందన్నారు. అన్ని మతాలు, వర్గాల్లోను మతతత్వశక్తులు అభద్రతను సృష్టిస్తున్నాయన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సచివాలయ వ్యవస్థ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రిక అని, ఆయన మీద నమ్మకంతో ఉన్నత విద్యావంతులు కూడా సచివాలయ ఉద్యోగాల్లో చేరారని చెప్పారు. భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్న సచివాలయ ఉద్యోగులకు చర్చల ద్వారా సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపించాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఐఆర్‌కు తగ్గకుండా ఫిట్‌మెంట్‌ 27 శాతం ఇవ్వాలని సూచించారు.  ఆయన వెంట సీపీఎం జిల్లా నేత నాగేంద్రకుమార్‌ ఉన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top