సాయుధ పోరు స్ఫూర్తితో నూతన భారత్‌ను నిర్మిద్దాం

CPM General Secretary Sitaram Yechury Slams On BJP Party - Sakshi

భారత రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బీజేపీని గద్దెదించాలి 

విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు    

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 

మిర్యాలగూడ/అర్వపల్లి/జనగామ: రాజ్యాంగ విలువలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు సహకరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. బీజేపీని నిలువరించేందుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరు స్ఫూర్తితో నూతన భారతదేశాన్ని సృష్టించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలన్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో తెలంగాణ సాయుధ పోరు ప్రారంభమయ్యేనాటికి బీజేపీ, సంఘ్‌పరివార్‌ ఉనికిలో లేవ న్నారు.

గాంధీజీ హత్య అనంతరం 1948లో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ మీద నిషేధం విధించారని చెప్పారు. తెలంగాణ పోరాట ఉత్సవాలను విమోచనంగా చెప్పుకుంటూ తమ ఘనకార్యంగా బీజేపీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ఏచూరి సూర్యాపేట జిల్లా అర్వపల్లి లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం స్మారక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో, జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ సాయు ద పోరాట వారోత్సవాల ముగింపు సభలో మాట్లాడారు.  

బీజేపీని నిలువరించే ప్రయత్నాలు 
రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అనేక అంశాలను కేంద్రం తమ చేతుల్లోకి తీసుకొని రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోందని ఏచూరి ధ్వజమెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు లాంటి అనేక రాష్ట్రాల్లో జీఎస్టీ వాటాను విడుదల చేయకుండా ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top