Bihar Government Announces Complete Lockdown Till May 15 - Sakshi
Sakshi News home page

Covid 19: లాక్‌డౌన్‌ ప్రకటించిన బిహార్‌

Published Tue, May 4 2021 1:19 PM

COVID19: Bihar Government Announces Lock Down Till May 15  - Sakshi

పాట్నా: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మొదటి దశతో పోల్చుకుంటే సెకండ్‌ వేవ్‌ కోవిడ్‌ వైరస్‌ భయంకరంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కొత్త కేసుల నమోదవటంతో పాటు వందల మంది కరోనా బాధితులు మరణిస్తున్నారు. మరోవైపు పలు ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితులకు కావల్సిన బెడ్లు, ఆక్సిజన్‌, మందులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ను విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిహార్‌లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు.

ఈరోజు (మంగళవారం) నుంచి మే15 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. కాగా, బిహార్‌లో ఇప్పటి వరకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింది. అయినప్పటికీ కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో సోమవారం కేబినేట్‌ సమావేశంలో సీఎం నితిష్‌ మంత్రులు, అధికారులతో చర్చించి లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బీహర్‌లో ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్‌ టీకా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బిహార్‌లో గడిచిన 24 గంటలలో కొత్తగా 11,407 కరోనా కేసులు నమోదయ్యాయి. బిహార్‌ వ్యాప్తంగా  1,07,667 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
చదవండి: ‘వైద్యం అందకే గంట వ్యవధిలో నా భర్త, తల్లిని కోల్పోయాను’

Advertisement
Advertisement