గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్‌.. మాజీ స్పీకర్‌ VS సిట్టింగ్‌ ఎమ్మెల్యే

Controversy Between Ex Speaker, Sitting Mla At Bhupalpally TRS - Sakshi

గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్ మొదలైందా? మాజీ స్పీకర్‌కు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మధ్య పోరు షురూ అయిందా? టీఆర్ఎస్ నాయకత్వం ఎవరికి మద్దతిస్తోంది? భూపాలపల్లిలో అధికార పార్టీ తరపున పరీక్ష రాసేదెవరు? సీటు రానివారి పరిస్థితి ఏంటి? జయశంకర్ భూపాలపల్లిలోని ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం భూపాలపల్లిలో అధికార పార్టీలో సెగలు మొదలయ్యాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సిటింగ్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య సీటు కోసం పంచాయతీ అక్కడి రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి.

ఎమ్మెల్సి మధుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. సారు రావాలి.. మీరు కావాలి అంటూ ఆయన అనుచరులు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరపడం వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మధుసూదనాచారి భూపాలపల్లి నుండి మళ్ళీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అధిష్టానం నుండి వచ్చిన స్పష్టమైన సూచనల ప్రకారమే చారి మళ్ళీ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

సర్వేలు ఏం చెబుతున్నాయి?
2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓడిపోవడం, తర్వాత గండ్ర అధికార పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో చారి భూపాలపల్లి నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మధుసూదనాచారి, ముఖ్యమంత్రి మాట మేరకే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న మాటలు వినిపించాయి. కేసీఆర్ మాట జవ దాటకుండా ఉండి మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సి పదవి పొందారు. భూపాలపల్లిలో అధికార పార్టీకి వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ చేయించిన సర్వేలో వెల్లడైందన్న వార్తలు అప్పట్లో బాగానే వినిపించాయి.

బర్త్‌డే పాలిట్రిక్స్‌?
మాజీ స్పీకర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదనే ఆలోచన ప్రజల్లో మొదలైనట్లుగా సీఎం దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రజల్లో చారీ పట్ల మళ్ళీ ఆదరణ మొదలైందని ఊహాగానాలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే మధుసూదనాచారి నియోజకవర్గంలో వరుసగా పర్యటించడం...ఎమ్మెల్సీ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించుతుండటంతో ఆయన వర్గం నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 13న నియోజకవర్గ వ్యాప్తంగా మధుసూదానాచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగటంతో భూపాలపల్లిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

నియోజకవర్గంలో మధుసూదనాచారి మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఎమ్మెల్యే చేస్తున్న వాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే పరీక్ష రాయబోతున్న మీ సహాయ సహకారాలు కావాలి అనడం, ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు నాదే అని మాట్లాడుతుండటంతో భూపాలపల్లి ఎమ్మెల్యే సీటు విషయంలో ఏదో జరుగుతుందనే చర్చ సాగుతోంది.

స్థానికంగా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మొదలవడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మధుసూదనాచారి మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్‌ అయ్యారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల పరీక్షలో రాసేదెవరో.. ఉత్తీర్ణులయ్యేదెవరో అన్న చర్చ నియోజకవర్గంలో తీవ్రంగా జరుగుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top