రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముంది?.. కౌంటర్‌లతో కొత్త రగడ

Congress Party Counter To BJP Criticism On Rahul Night Club Video - Sakshi

సాక్షి, ఢిల్లీ: రాహుల్ గాంధీ నైట్‌ క్లబ్‌ పార్టీ వీడియో పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముందని?, ఫ్రెండ్‌  వివాహ వేడుకకు రాహుల్ నేపాల్ వెళ్లడం నేరమా? అని బీజేపీని సూటిగా ప్రశ్నించారు. 

నేపాల్ మన(భారత్‌కు) మిత్ర దేశం. ఆహ్వానం మేరకే రాహుల్ గాంధీ వివాహ వేడుకకు వెళ్లారు. అంతేగానీ ప్రధాని మోదీలా మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట వేడుకకు వెళ్లలేదు.. షరీఫ్‌తో కలిసి కేక్‌ కట్టింగ్‌ చేయలేదు. ఆయన పర్యటన తర్వాతే పఠాన్‌కోట్‌లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అని రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు.  

రాహుల్‌ చేసిందాంట్లో తప్పేమీ లేదు. అలా పెళ్లికి వెళ్లడం సంప్రదాయం కూడా. నేరం కాదు. బహుశా బీజేపీ త్వరలో ఇలా బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని ఒక నేరంగా ప్రకటిస్తుందేమో అంటూ సెటైర్లు వేశారు రణ దీప్ సూర్జేవాలా. 

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌,బీజేపీల మధ్య కొత్త రగడకు దాడి తీసింది రాహుల్‌ నైట్‌ క్లబ్‌ వీడియో. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి వరుసపెట్టి ట్వీట్లు, పోస్టులతో సెటైర్లు, విమర్శలు గుప్పి‍స్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌ కౌంటర్‌కి దిగింది. బీజేపీ నేత ప్రకాశ్‌ జవదేకర్‌కు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన కాంగ్రెస్‌ నేత మాణిక్యం ఠాకూర్‌.. ఇది ఎవరో చెప్పాలంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

చదవండి:  రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియో దుమారం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top