నో చాన్స్‌..టీపీసీసీలో ఓరుగల్లుకు మొండిచేయి

Congress: No Chance For Warangal Leaders AS ATPCC Chief - Sakshi

మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య..

బలరాం నాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ‘దుద్దిళ్ల’కు నిరాశే

‘కొండా’ దంపతులు, పలువురు సీనియర్లకు నో చాన్స్‌

సాక్షి, వరంగల్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ)లో ఆ పార్టీ అధిష్టానం ఉమ్మడి వరంగల్‌కు మొండిచెయ్యి చూపింది. ఏళ్ల తరబడిగా కాంగ్రెస్‌లో మనుగడ సాగిస్తున్న పలువురు సీనియర్లను పార్టీ విస్మరించింది. అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు సీనియర్‌ నాయకుల పేర్లు లేకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆరు జిల్లాల పరిధిలో ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్యేతోపాటు పలువురు సీనియర్లు ఉన్నప్పటికీ వేం నరేందర్‌రెడ్డి, పోదెం వీరయ్య మినహా ఎవరికీ ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడం గమనార్హం. తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మంత్రిగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యకు గౌరవప్రదంగానైనా ఏ పదవీ ఇవ్వ లేదు.

చదవండి: రేవంత్‌కు పోస్ట్‌: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, క్యాంపెయిన్‌ కమిటీ, ఎలక్షన్‌ మేనేజ్‌ మెంట్, ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ కమిటీల్లోనూ ఓరుగల్లు నేతల పేర్లను పరిగణలోకి తీసుకో లేదు. భౌగోళికంగా ఉమ్మడి కరీంనగర్‌లో మంథని నియోజకవర్గం ఉన్నా.. ఆ నియోజకవర్గంలోని ఆరు మండలాలు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కిందకు వస్తాయి. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పేరు కూడా పీసీసీ చీఫ్‌ పదవికి పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరగ్గా.. చివరికి టీపీసీసీలో కనిపించలేదు. కేంద్ర మాజీ మంత్రి, షెడ్యూల్‌ కులాలకు చెందిన పోరిక బలరాంనాయక్, మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండపల్లి దయాసాగర్‌లను ఈ కమిటీ నిరాశపర్చింది.

చదవండి: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి

నర్సంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ నిరాకరించినా.. ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన సీనియర్‌ నేత దొంతి మాధవరెడ్డినీ విస్మరించింది. టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు కీలకంగా మారిన సమయంలో ఎంతగా ప్రయత్నించినా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయనను విస్మరించడం పట్ల కార్యకర్తల్లో తీవ్రమైన చర్చ జరు గుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పలువురిని కూడా పార్టీ అ«ధిష్టానం నిరాశపర్చడం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. కాగా కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్న .. ధనసరి అనసూయ(సీతక్క)కు ఈ కమిటీలో కీలక పదవే దక్కుతుందని భావించారు.

అయితే ఆమెను ఆ పదవికే పరిమితం చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రస్థాయి ఏ కమిటీలోనూ జిల్లా నాయకుల ప్రాధాన్యం లేనట్లైంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉమ్మడి వరంగల్‌కు చెందిన హేమాహేమీ నాయకులు రాష్ట్రకమిటీతో పాటు జాతీయ స్థాయి పదవుల్ని అందుకున్న సందర్భాలున్నాయి. కానీ ఇందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు ఈ కమిటీలో ఏర్పడింది. పార్టీ అ«ధిష్టానం పలువురు సీనియర్లకు మొండిచెయ్యి చూపడం కలకలం రేపుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top