Congress: మమ్మల్నీ అరెస్ట్‌ చేయండి

Congress Leader Slams Government Over PM Posters - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్లు వేసిన వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడం, కేసులు నమోదు చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీని తాము కూడా అలాంటి ప్రశ్నలను అడుగుతాం, ప్రజల అవసరాలు తీరేదాకా అడుగుతూనే ఉంటాం, అరెస్ట్‌ చేస్తారా అని అగ్రనేత రాహుల్‌ సహా ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు వారు ఆదివారం తమ ట్విట్టర్‌ ఖాతాల్లో ప్రొఫైల్‌ ఫొటోల స్థానంలో ‘కోవిడ్‌ టీకాలను విదేశాలకు ఎందుకు ఎగుమతి చేశారు?’ అనే పోస్టర్‌ను ఉంచారు. టీకాలు, మందులు, ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడే ప్రజలు ఇలాంటి కఠిన ప్రశ్నలనే ప్రధాని మోదీని అడుగుతారని వారు పేర్కొన్నారు.

రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో ‘మోదీజీ, మా పిల్లలకు అందాల్సిన టీకాలను విదేశాలకు ఎందుకు పంపించారు?’ అని ఉన్న పోస్టర్‌ను షేర్‌ చేస్తూ ‘నన్నూ అరెస్ట్‌ చేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘మా ఇంటి ప్రహరీ గోడపై ఇలాంటి పోస్టర్లను రేపే అంటిస్తా. వచ్చి అరెస్ట్‌ చేయండి’ అంటూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలను కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ సవాల్‌ చేశారు.

‘ప్రధానిని విమర్శిస్తూ పోస్టర్లు వేయడం కూడా నేరమేనా? దేశంలో ఇప్పుడు మోదీ పీనల్‌ కోడ్‌ అమల్లో ఉందా? మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఢిల్లీ పోలీసులకు ఇది తప్ప మరే పనీలేదా?’ అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రస్తుతం కోవిడ్‌ టీకా, మందులు, ఆక్సిజన్‌ అవసరం తీవ్రంగా ఉందని కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా తెలిపారు. ప్రజలు అవి అందేదాకా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటారన్నారు. 

పోస్టర్ల వెనుక ఆప్‌ నేత
ఈ పోస్టర్ల వ్యవహారం వెనుక ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) హస్తం ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అరెస్టయిన కొందరు ఆప్‌ నేత అర్వింద్‌ గౌతమ్‌ పేరును విచారణ సందర్భంగా వెల్లడించారని పేర్కొన్నారు. అర్వింద్‌ గౌతమ్‌ ఢిల్లీ మంగోల్‌పురి ప్రాంతంలోని 37వ వార్డు ఆప్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడని, ప్రస్తుతం పరారీలో ఉన్నాడని వెల్లడించారు. పోస్టర్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. 
చదవండి: 'కోవిడ్‌పై ప్రభుత్వ విధానం వినాశకరం'

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top