
విజయవాడ: కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతామోహన్,. అసలు పేదలు చదువుకోవడం అనేది చంద్రబాబుకు అస్సలు ఇష్టం ఉండదని ధ్వజమెత్తారు చింతామోహన్. అందుకే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 5వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేశారని మండిపడ్డారు
చంద్రబాబు పాలనలో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఈ ఏడాది మరో ఐదు వేల స్కూల్స్ మూసివేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, పేదల చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదనేది ఈ తరహా చర్యలతోనే అర్థమవుతుందని విమర్శించారు.
‘రాబోయే రోజుల్లో 35 వేల ప్రాథమిక పాఠశాలలను 10 వేలకు కుదించాలని చూస్తోంది. తల్లికి వందనం పథకం డబ్బులతో భార్య భర్తల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చురేపారు. తల్లికి వందనం పథకం డబ్బును స్కాలర్ షిప్ ల ద్వారా నేరుగా పాఠశాలలకే ఇవ్వాలి. ఉపాధి హామీ పథకం కూలీలకు కూటమి ప్రభుత్వం 10శాతమే కూలీ ఇస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. మూడు నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్ లకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. అమరావతిలో రైతులకు ఇచ్చిన హమీలను ఈరోజు వరకూ చంద్రబాబు నెరవేర్చలేదు.
అమరావతికి నేను వ్యతిరేకం కాదు..కానీ మీ అమరావతి సక్సెస్ కాదు. చంద్రబాబు కాన్సెప్ట్ పూర్తిగా విఫలం చెందింది. రైతులు మనస్పూర్తిగా భూములు ఇవ్వడం లేదు. అమరావతిలో మూరెడు మట్టి తీస్తే చారెడు నీరు వస్తోంది. నీళ్లల్లో ఏ నగరం కడతావయ్యా చంద్రబాబు.
గన్నవరంలో ఎయిర్ పోర్టు ఉంటే అమరావతిలో మరో ఎయిర్ పోర్టు కడతానంటున్నాడు. 30 కిలోమీటర్ల దూరంలోనే మరో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఎందుకు?, చంద్రబాబు ఎవరిస్తున్నారయ్యా నీకు ఇలాంటి సలహాలు. రైతుల నోళ్లు కొట్టి భూములు తీసుకుని వాళ్లకిచ్చిన హామీలు తప్పి ఎందుకు ఇలాంటి పనులు. రైతులకు నష్టం చేసి నువ్వు ప్రతిఫలం పొందాలనుకునే ఆలోచన మానుకో. కుప్పంలో పేదరికం తీసేయలేనోడు..రాష్ట్రంలో ఏం చేస్తాడంట’ అని చింతామోహన్ విమర్శించారు.