కీలక సమావేశం.. వ్యూహరచనలో కాంగ్రెస్‌

Congress Key Meeting In Gandhi Bhavan Hyderabad - Sakshi

నేడు గాంధీభవన్‌లో కీలక సమావేశం 

2 పట్టభద్రుల నియోజకవర్గాల ముఖ్యులకు పిలుపు

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే నెలలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం రచిస్తోంది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలోని దాదాపు సగం నియోజకవర్గాలకు చెందిన పట్టభద్రులు ఓటు వేయనుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫలితం రాబట్టుకోవాలనే కోణంలో టీపీసీసీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ రెండింటిలో ఒక్క స్థానాన్నయినా కచ్చితంగా గెలవాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో తన భవిష్యత్తును పదిలం చేసుకోవడమే తక్షణ కర్తవ్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల వ్యూహరచన కోసం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌ వేదికగా కీలక భేటీ జరగనుంది.

కలిసికట్టుగా కార్యరంగంలోకి... 
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తరుణంలో తక్షణమే ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. ఆదివారం జరిగే సమావేశానికి ఆయా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన కీలక నాయకులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు, ఎంపీపీలు, జెడ్పీటీసీల నుంచి బ్లాక్, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల వరకు అందరినీ ఆహ్వానించింది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

మండల, అసెంబ్లీ, లోక్‌సభ, జిల్లా స్థాయిల్లో అందరు నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో పాటు ఎన్నికల ప్రచార సరళిని కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టభద్రులతో గేట్‌మీటింగ్‌లు ఏర్పాటు చేసే ఆలోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్టు సమాచారం. ఈ మీటింగ్‌ల ద్వారా పెద్ద ఎత్తున పట్టభద్రులను కలిసి రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవ లంబిస్తోన్న నిరుద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ప్రచారం చేసి ఓట్లను రాబట్టుకోవాలని యోచిస్తోంది.

ఈ మీటింగ్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీ మత రాజకీయాలను ఎండగడుతూ కరపత్రాల ద్వారా పెద్ద ఎత్తున పట్టభద్రుల్లోకి వెళ్లాలనేది కాంగ్రెస్‌ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థులు రాములు నాయక్‌ (నల్లగొండ–ఖమ్మం– వరంగల్‌), చిన్నారెడ్డి (రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌)లు ఇప్పటికే ప్రచార పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే కీలక సమావేశం అనంతరం పక్కా కార్యాచరణ ప్రణాళికతో పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top