ఉత్తరాఖండ్‌ వలసలకు కాంగ్రెస్‌ కారణం

Congress govts delayed projects, forced people to migrate from villages - Sakshi

ప్రధాని మోదీ విమర్శ

డెహ్రాడూన్‌: కేంద్రంలో, రాష్ట్రంలోని గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దశాబ్దాల పాటు ఉత్తరాఖండ్‌ అభివృద్ధి ప్రాజెక్టులను జాప్యం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ వల్ల ఉత్తరాఖండ్‌ గ్రామాల్లో ప్రజలు పొట్ట చేతబట్టుకొని వలసలు పోవాల్సివచ్చిందని విమర్శించారు. గత ప్రభుత్వానికి రాష్ట్రాన్ని దోచుకోవడం మీదనే శ్రద్ధ ఉండేదని, అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని నిప్పులు చెరిగారు.

ఉత్తరాఖండ్‌ పర్యటనలో భాగంగా ఆయన రూ.17,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆరంభించడం, శంకుస్థాపన చేశారు. వీటిలో రూ. 5,747కోట్ల విలువైన లఖ్వార్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ శంకుస్థాపన కూడా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన 1974లోదని, కానీ కార్యరూపం దాల్చేందుకు ఇన్నాళ్లు పట్టిందని మోదీ గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ పాపమని, దీన్ని ప్రజలు మర్చిపోరని విమర్శించారు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటామని, విపక్షాలు స్వీయ ప్రయోజనాలు చూసుకుంటాయని ఎద్దేవా చేశారు.  

రావత్‌పై ఆరోపణలు
రాష్ట్ర కాంగ్రెస్‌ నేత హరీశ్‌ రావత్‌పై ప్రధాని విరుచుకుపడ్డారు. 2016లో రెబల్‌ ఎంఎల్‌ఏల కొనుగోలుకు రావత్‌ బేరాలాడుతున్న వీడియో గతంలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే! దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని దోచుకోండి కానీ తన ప్రభుత్వాన్ని కాపాడండి అని రావత్‌ భావించేవారని మోదీ విమర్శించారు. తాను ముందుగా ఇచ్చిన హామీల మేరకే ప్రస్తుత ప్రాజెక్టులు చేపట్టామని, రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ పాటుపడతానని చెప్పారు. ఈ పర్యటనలో ఆయన రూ. 3,420 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆరంభించారు. అదేవిధంగా రూ. 14,127 కోట్ల ప్రాజెక్టులకు పునాది వేశారు. ఆరంభించిన ప్రాజెక్టుల్లో మొరాదాబాద్‌ కాశీపూర్‌ రోడ్డు, కుమావ్‌లో ఎయిమ్స్‌ శాటిలైట్‌ సెంటర్‌ తదితరాలున్నాయి. ఈ నెల్లో మోదీ ఉత్తరాఖండ్‌లో పర్యటించడం ఇది రెండోసారి. నెలారంభంలో ఆయన రూ.18వేల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top