ఎమ్మెల్యేనే లేని చోట ఇదేం తలనొప్పిరా బాబూ.. కొత్తగా మూడో కృష్ణుడి ఎంట్రీ

Conflicts in Sattenapalle TDP: YV Anjaneyulu Vs Kodela Sivaram - Sakshi

ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యేనే లేని చోట ఇదేం తలనొప్పిరా బాబూ అని కొందరు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు కొత్తగా మూడో కృష్ణుడు రంగంలోకి దిగాడు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదీ? ఏ జిల్లాలో ఉంది? 

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లకు పెద్ద తలనొప్పిగా మారింది. సత్తెనపల్లి పేరు వింటేనే తెలుగుదేశం అధినేతకు బీపీ పెరిగిపోతోంది. కోడెల శివప్రసాదరావు చనిపోవడంతో సత్తెనపల్లిలో ఇన్‌ఛార్జి పదవి ఖాళీ అయ్యింది. అప్పటినుంచి కోడెల కొడుకు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు నువ్వా? నేనా? అంటూ ప్రతి విషయంలో పోటీ పడుతున్నారు. ఇన్‌ఛార్జి పదవి కావాలంటూ ఇద్దరూ అధినేత దగ్గర తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇద్దరు నేతలు వేర్వేరుగా చేస్తున్నారు. 

ఈ రెండు ముక్కలాటపై నారా బాబులిద్దరూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని అచ్చెన్నాయుడిని రంగంలోకి దించారు. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చెయ్యవద్దని, పార్టీ ఆఫీసులోనే కార్యక్రమాలు నిర్వహించాలని స్వయంగా అచ్చన్నాయుడు ప్రకటించారు. అయినా ఇద్దరు నేతల తీరు మారలేదు. పార్టీ ఆఫీసులోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఒకరి తర్వాత మరొకరు వస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

సత్తెనపల్లిలో టీడీపీ గ్రూపు రాజకీయాలు కంట్రోల్ చేయడం కోసమంటూ.. అధిష్టానం ఒక ఇన్‌ఛార్జిని కూడా ఏర్పాటు చేసింది. రెండు గ్రూపుల దెబ్బకు ఇన్‌ఛార్జి దండం పెట్టాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. చంద్రబాబు, లోకేష్ ఎన్ని చెప్పినా... ఏం చెప్పినా... ఎన్నిసార్లు చెప్పినా వారి మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇద్దరు నాయకులు. 

ఇప్పుడు సత్తెనపల్లిలో మరో ఛోటా నాయకుడు వచ్చి చేరాడు. పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీలు, నాలుగు జెండాలతో తెగ హడావుడి చేస్తున్నాడు తెలుగుయువత నేత అబ్బూరు మల్లి. దీంతో తెలుగుదేశం కార్యకర్తలకు మైండ్ బ్లాక్ అవుతోంది. ఏ నేత వద్దకు వెళితే ఏమవుతుందోనని కొంతమంది ఇంట్లోనే కూర్చుంటే.. మరికొంతమంది మాత్రం సత్తెనపల్లిలో పార్టీ పరిస్థితి చిరిగిన విస్తరాకులా మారినా అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు ఉదాసీనత వల్లే పార్టీ రోజురోజుకూ పతమనవుతుందని నిప్పులు చెరుగుతున్నారు.

కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య వార్ నడుస్తుంటే అబ్బూరు మల్లి కేవలం ఆటలో అరటిపండు మాత్రమే అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో మీడియా హడావుడితో ఎదిగిన నాయకులు చాలామంది ఉన్నారని, మల్లిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top