breaking news
yv anjaneyulu
-
సత్తెనపల్లి టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. నగరంలోని ఎన్టీఆర్ భవన్లో వైవీ ఆంజనేయుల వ్యతిరేకవర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశానికి ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్థానికులకే సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలని వైవీ ఆంజనేయులు వ్యతిరేకవర్గం డిమాండ్ చేస్తోంది. చదవండి: (మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు) -
ఎమ్మెల్యేనే లేని చోట ఇదేం తలనొప్పిరా బాబూ.. కొత్తగా మూడో కృష్ణుడి ఎంట్రీ
ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యేనే లేని చోట ఇదేం తలనొప్పిరా బాబూ అని కొందరు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు కొత్తగా మూడో కృష్ణుడు రంగంలోకి దిగాడు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదీ? ఏ జిల్లాలో ఉంది? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లకు పెద్ద తలనొప్పిగా మారింది. సత్తెనపల్లి పేరు వింటేనే తెలుగుదేశం అధినేతకు బీపీ పెరిగిపోతోంది. కోడెల శివప్రసాదరావు చనిపోవడంతో సత్తెనపల్లిలో ఇన్‌ఛార్జి పదవి ఖాళీ అయ్యింది. అప్పటినుంచి కోడెల కొడుకు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు నువ్వా? నేనా? అంటూ ప్రతి విషయంలో పోటీ పడుతున్నారు. ఇన్‌ఛార్జి పదవి కావాలంటూ ఇద్దరూ అధినేత దగ్గర తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇద్దరు నేతలు వేర్వేరుగా చేస్తున్నారు. ఈ రెండు ముక్కలాటపై నారా బాబులిద్దరూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని అచ్చెన్నాయుడిని రంగంలోకి దించారు. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చెయ్యవద్దని, పార్టీ ఆఫీసులోనే కార్యక్రమాలు నిర్వహించాలని స్వయంగా అచ్చన్నాయుడు ప్రకటించారు. అయినా ఇద్దరు నేతల తీరు మారలేదు. పార్టీ ఆఫీసులోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఒకరి తర్వాత మరొకరు వస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ గ్రూపు రాజకీయాలు కంట్రోల్ చేయడం కోసమంటూ.. అధిష్టానం ఒక ఇన్‌ఛార్జిని కూడా ఏర్పాటు చేసింది. రెండు గ్రూపుల దెబ్బకు ఇన్‌ఛార్జి దండం పెట్టాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. చంద్రబాబు, లోకేష్ ఎన్ని చెప్పినా... ఏం చెప్పినా... ఎన్నిసార్లు చెప్పినా వారి మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇద్దరు నాయకులు. ఇప్పుడు సత్తెనపల్లిలో మరో ఛోటా నాయకుడు వచ్చి చేరాడు. పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీలు, నాలుగు జెండాలతో తెగ హడావుడి చేస్తున్నాడు తెలుగుయువత నేత అబ్బూరు మల్లి. దీంతో తెలుగుదేశం కార్యకర్తలకు మైండ్ బ్లాక్ అవుతోంది. ఏ నేత వద్దకు వెళితే ఏమవుతుందోనని కొంతమంది ఇంట్లోనే కూర్చుంటే.. మరికొంతమంది మాత్రం సత్తెనపల్లిలో పార్టీ పరిస్థితి చిరిగిన విస్తరాకులా మారినా అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు ఉదాసీనత వల్లే పార్టీ రోజురోజుకూ పతమనవుతుందని నిప్పులు చెరుగుతున్నారు. కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య వార్ నడుస్తుంటే అబ్బూరు మల్లి కేవలం ఆటలో అరటిపండు మాత్రమే అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో మీడియా హడావుడితో ఎదిగిన నాయకులు చాలామంది ఉన్నారని, మల్లిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. -
టీడీపీలో ఇంటిపోరు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో ‘ఇంటింటికీ తెలుగు దేశం’ కార్యక్రమం పార్టీలో విభేదాలను పెంచుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీటు ఆశిస్తున్న ముఖ్య నేతలను, వ్యతిరేక వర్గాలను నాయకులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు. సొంత కార్యక్రమంగా భావిస్తూ కొందరికే పరిమితం చేస్తున్నారు. ముఖ్య నేతలను పిలిస్తే ప్రజల్లో పలుకుబడి పెరిగి రానున్న ఎన్నికల్లో సీటుకు పోటీ అవుతారనే భయంతో సమాచారమే ఇవ్వడం లేదు. పార్టీని పటిష్టం చేసేందుకు అధినేత చంద్రబాబు రూపొందించిన ఈ కార్యక్రమ నిబంధనలను నేతలు పాటించకపోవడం వల్లనే ఇంటిపోరు పెరుగుతోందని అభిమానులు చెబుతున్నారు. తొలి విడత కార్యక్రమం పేలవంగా ముగియడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు డిసెంబరు నెలాఖరులో నాయకులతో సమావేశం నిర్వహించి రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రారంభించిన పదిరోజుల్లోనే డొల్లతనం బయట పడింది. జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు, 11 మంది నియోజకవర్గ ఇన్చార్జిలు ఇంటింటికీ దేశం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గ ఇన్చార్జిలకు సీటు కేటాయింపుపై అధినేత నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో మిగిలిన నేతలను కూడా ప్రజలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఈ కార్యక్రమాల సమాచారం అందనీయడం లేదు. ఆహ్వానం పంపడం లేదు. ఆహ్వానాలు అందడం లేదు.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇన్చార్జి బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ తన వ్యతిరేక వర్గానికి ఆహ్వానం పంపడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ ఆయనతోపాటు మరో ఐదారుగురు సీటు ఆశిస్తున్నారు. వీరిలో కొందరికి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. నగర పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ మీరావలి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావులకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన నాయకులను విస్మరించడం ఎంత వరకు సమంజసమనే అభిప్రాయం వినపడుతోంది. పోటీ చేయాలని పుష్పరాజ్‌పై ఒత్తిడి తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్‌కుమార్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజ లతో మమేకం అవుతుండటంతో ఆయన వ్యతిరేక వర్గం మాజీ మంత్రి పుష్పరాజ్‌ను కొత్తగా తెరపైకి తీసుకువచ్చి, రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తమకు ఎటువంటి ఆహ్వానం లేదని శ్రావణ్ వ్యతిరేక వర్గం పేర్కొంటున్నది. మాజీ మంత్రి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి కోడెల శివప్రసాద్ ఆత్మీయపాదయాత్ర పేరుతో సొంత కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ పాదయాత్రలో అన్ని వర్గాల నాయకుల ను కలుసుకునే యత్నం చేస్తున్నారు. అయితే ఆయన వ్యతిరేక వర్గమైన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిమి వెంకట రామిరెడ్డి, బీసీ విభాగ రాష్ట్ర నాయకులు వెల్లపు నాగేశ్వరరావు తదితరులు దీనికి దూరంగానే ఉంటున్నారు. కోడెలకు సీటు ఇవ్వరాదనే ప్రధాన ఉద్దేశంతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సొంత కార్యక్రమానికి రూపకల్పన సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ అక్కడ సీటు ఆశిస్తున్న మరో నాయకుడు మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులుకు ఎటువంటి ఆహ్వానం పంపడం లేదు. దీంతో వైవీ ఆంజనేయులు సొంతంగా ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్నారు. ప్రతి రెండు రోజులకు ఓ మారు ఒక గ్రామానికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నానని ప్రజలకు చెబుతున్నారు. మొత్తం మీద ఇంటింటికీ తెలుగుదేశం నియోజకవర్గాల్లో విభేదాలను పెంచుతోందని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.