చంద్రబాబు మోసాలతో పోటీ పడలేం: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లే: సీఎం జగన్‌

Published Mon, Apr 8 2024 11:22 AM

CM YS Jagan Speech In Memantha Siddham Bus At Venkatachampally - Sakshi

సాక్షి, వెంకటాచలంపల్లి: రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి. విలువలులేని, విశ్వసనీయతలేని రాజకీయాలు వచ్చేశాయి. వీటిని మార్చేందుకు మీ బిడ్డగా అడుగులు ముందుకు వేస్తున్నాను అని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లే అని సూచించారు. 

కాగా, సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర పదకొండో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ..‘గత ప్రభుత్వంలో ఎంత మందికి పెన్షన్‌ వచ్చేది. అప్పట్లో పెన్షన్‌ ఎంత వచ్చేదో మీకు గుర్తుందా?. కొన్ని విషయాలు ఆలోచించాలని అవ్వాతాతలను కోరుతున్నాను. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేది. మీ బిడ్డ ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నాం. 

ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి. అవ్వాతాతలు పెన్షన్‌ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక. అవ్వాతాతల ఆత్మగౌరవం గురించి నేను ఆలోచన చేశాను. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. వాలంటీర్లతో నేరుగా అవ్వతాతల ఇంటికే పెన్షన్‌ పంపించాం. 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీన ఉదయమే పెన్షన్‌ అందించాం. గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్‌ ఇస్తూ ఉంటే దానిని మార్పు చేశాం. అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ అందించాం. ప్రతీ గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేశాం.

చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలేదు. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు. ఏ రోజైనా చంద్రబాబు మీ గురించి ఆలోచన చేశాడా?. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి. విలువలులేని విశ్వసనీయతలేని రాజకీయాలు వచ్చేశాయి. వీటిని మార్చేందుకు మీ బిడ్డగా అడుగులు ముందుకు వేస్తున్నాను.

ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పారు. ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు. చంద్రబాబు, వారి కూటమిలా నొటికొచ్చిన అబద్ధాలు చెప్పలేను. మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తాడు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రూ.3వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. నెలకు రూ.2వేల కోట్లు పెన్షన్లలకే ఇస్తున్నాం. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డ ప్రభుత్వంలో 99 శాతం హామీలను అమలు చేశాం. రంగు రంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మెదు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలను అసలు నమ్మకండి. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లే’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement