'టార్గెట్‌ 175' కుప్పం నుంచే తొలి అడుగు | Sakshi
Sakshi News home page

'టార్గెట్‌ 175' కుప్పం నుంచే తొలి అడుగు

Published Fri, Aug 5 2022 3:13 AM

CM YS Jagan Meeting With ysrcp Kuppam Activists - Sakshi

గత సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి కంటే కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుతోంది. వచ్చే రెండు రోజుల్లో కుప్పం మునిసిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నాం. భరత్‌ అడిగాడు, సీఎం వైఎస్‌ జగన్‌గా నేను చేయిస్తున్నాను. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పని జరుగుతోంది. ఏడాది లోపు దాన్ని పూర్తి చేసి, కుప్పంకు కృష్ణా జలాలను తెస్తాం. 
– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేసే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ కార్యకర్తలకు ఉద్బోధించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై.. ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేశారు. కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని, కార్యకర్తలకు కష్టసుఖాల్లో తోడు, నీడగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఆ నియోజకవర్గంలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసిందని గుర్తు చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తించి, ఆశీర్వదించడమే ఈ విజయానికి కారణం అని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని, ఇంటింటా మనం చేసిన మంచి కన్పిస్తోందన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రతి కార్యకర్త కాలరెగరేసుకుని ఇంటింటికీ వెళ్లి.. ‘అక్కా.. మీకు ఈ మంచి చేశామా? లేదా?’ అని అడిగే స్థాయిలో.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మంచి చేశామని చెప్పారు. ప్రజల ఆశీస్సులను ఓట్ల రూపంలోకి మార్చే బృహత్తర బాధ్యత మీదేనని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ‘మూడేళ్లుగా భరత్‌ చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. భరత్‌కు ఒక్కసారి తోడుగా నిలబడి గెలిపించుకుని రండి.. మంత్రిని చేస్తాను.. కుప్పం అభివృద్ధికి మరింతగా ఉపయోగపడతాడు’ అని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. సీఎం ఏమన్నారంటే..


బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం కుప్పం 
► కుప్పం టీడీపీకి ఒక కంచుకోట అని, ఎప్పటి నుంచో చంద్రబాబుకు మద్దతుగా ఉందని బయట ప్రపంచం అంతా అనుకుంటారు. వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం. బీసీలకు మంచి చేస్తున్నాం అంటే.. అది ప్రతి పనిలోనూ కనిపించాలి. 
► బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్‌ రిటైర్డు అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం. దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరమయ్యారు. ఆ కుటుంబాన్ని వదిలేయకుండా, ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చాం. చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో ఆయన్ను పరామర్శించేందుకు నేను ఆస్పత్రికీ వెళ్లాను. 
► ఆరోజు భరత్‌ నాకు పరిచయమయ్యాడు. భరత్‌ను ప్రోత్సహిస్తానని నేను ఆరోజే చెప్పాను. ముందుండి ప్రతి అడుగులోనూ అతనికి అండగా నిలబడుతున్నా. మీరు కూడా అతనిపై అదే ఆప్యాయత చూపించారు. దీనివల్ల భరత్‌ నిలదొక్కుకున్నాడు. అతన్ని ఇదే స్థానంలో నిలబెడతారా? లేక పై స్థానంలోకి తీసుకువెళ్తారా? అన్నది మీ మీదే ఆధారపడి ఉంది. 

రెట్టించిన ఉత్సాహంతో పని చేయండి 
► కుప్పం నియోజకవర్గాన్ని నా నియోజకవర్గంగానే చూస్తాను. అన్ని రకాలుగా మద్దతు ఇస్తాను. గతంలో కుప్పంలో గెలుస్తామా? అంటే  ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడూ జరగని అద్భుతాలు జరిగాయి. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేశాం. ఇవాళ ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
► ఇవాళ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. పథకాలన్నీ అందాయా? అని అడుగుతున్నాం. అందాయని ప్రజలు చెబుతున్నారు. రాజకీయాల్లో మనం ఉన్నందుకు సంతోషం కలుగుతోంది. ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు, వారు మనల్ని దీవిస్తున్నప్పుడు రాజకీయ నాయకుడిగా మనకు ఉత్సాహం వస్తుంది.
► ఇవాళ కాలర్‌ ఎగరేసుకుని.. మనం గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ ఆశీస్సులు ఇస్తున్న ప్రజల మద్దతు తీసుకునే బాధ్యత మీది. 175కు 175 స్థానాలు గెలిచే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలి. మీ భుజస్కంధాల మీద ఈ బాధ్యత పెడుతున్నాను. మీపై నాకు ఆ నమ్మకం ఉంది. రెట్టించిన ఉత్సాహంతో పని చేయండి. కార్యకర్తలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తా. 
► ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇప్పుడే ఎక్కువ అభివృద్ధి 
► ‘కుప్పంలో చంద్రబాబు గెలుస్తారు.. ఆయన సీఎం అవుతారు.. కుప్పం అభివృద్ధి చెందుతుంది’ అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు. నిజం చెప్పాలంటే చంద్రబాబు హయాంలో కన్నా..  ఈ మూడేళ్లలోనే ఆ నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది.
► స్కూళ్లలో నాడు–నేడు, ఇళ్ల పట్టాలు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, ప్రతి గ్రామంలో సచివాలయం, విలేజ్‌ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీ కూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు. ఇప్పుడు మన కళ్లెదుట కన్పిస్తున్నాయి. నాడు – నేడుతో బడుల రూపు రేఖలు మారుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా అమల్లోకి వస్తుంది. 

వచ్చే ఎన్నికల్లో గెలిచే తొలి సీటు కుప్పం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్‌.. సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు 
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మొదటి గెలుపు కుప్పం కావాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్షను నిజం చేయడానికి నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలందరం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలవటం కష్టం కాదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి చెందిన కుప్పం కార్యకర్తలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

175కు 175 అసెంబ్లీ సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నియోజకవర్గం నుంచే మొదలు కావాలని సీఎం సూచించారని తెలిపారు. పార్టీ క్యాడర్‌ను ఉత్తేజ పరిచారని, భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే దానిపై దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఇంట్లోనూ వివరించాలని సూచించారని తెలిపారు.

కార్యకర్తలందరితో ఆప్యాయంగా మాట్లాడారని, అన్ని వేళలా నియోజకవర్గానికి తను అండగా ఉంటానని భరోసా ఇచ్చారని చెప్పారు. టీడీపీ తరహాలో కక్ష సాధింపు రాజకీయాలు వద్దేవద్దని స్పష్టం చేశారని వివరించారు. వైఎస్సార్‌సీపీకి మైలేజ్‌ వస్తుందని హంద్రీ–నీవా కాలువ (కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌)ను సీఎం రమేష్‌ మూడేళ్లుగా పూర్తి చేయడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వేరే వారికి కాంట్రాక్టు ఇచ్చి ఏడాదిలో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement