నా పదవికి ఢోకా లేదు: సీఎం

CM Yediyurappa Said No Changes In Leadership Change - Sakshi

ఆప్తులకు ముఖ్యమంత్రి యడియూరప్ప భరోసా  

శివాజీనగర: నాయకత్వ మార్పు ప్రస్తావనే లేదని బీజేపీ హైకమాండ్‌ స్పష్టంచేయడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప వ్యూహాత్మక మౌనం దాల్చారు. రాష్ట్ర ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ పర్యటన నేపథ్యంలో వ్యతిరేకులు ఫిర్యాదులకు పదును పెట్టగా, యడ్డి క్యాంపులో ప్రశాంతత నెలకొంది. బుధవారం మామూలుగానే కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు.  ముఖ్యమంత్రి ఇంటికి సన్నిహిత ఎమ్మెల్యేలు, నాయకులు దండుగా వచ్చి తమ మద్దతును వ్యక్తం చేశారు.

నాయకత్వ మార్పునకు అవకాశం ఇవ్వబోమని, అరుణ్‌సింగ్‌ను కలిసి ఇదే మాటను చెబుతామని తెలిపారు. అరవింద బెల్లద్, బసనగౌడ పాటిల్‌ యత్నాళ్, సీపీ.యోగేశ్వర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన యడియూరప్ప మద్దతుతారులు.. సీఎంను మారిస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. మద్దతుదారులకు సీఎం సాంత్వన పలికి, ఏమీ జరగదు, నేనే సీఎంగా కొనసాగుతాను, అన్నీ సర్దుకుంటాయని చెప్పి పంపుతున్నారు.

అంతా బాగుంది: అరుణ్‌సింగ్‌  
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర బీజేపీలో అందరూ ఒక్కటేనని, సీఎం యడియూరప్ప ప్రభుత్వం చక్కగా పాలన సాగిస్తోందని రాష్ట్ర బీజేపీ ఇంచార్జి అరుణ్‌ సింగ్‌ అన్నారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన తొలిరోజు బుధవారం పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. యడియూరప్ప నాయకత్వం మార్పు అనే ఊహాగానాల మధ్య అరుణ్‌ సింగ్‌ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. యడియూరప్పను మార్చాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు లోపాయికారిగా ప్రయత్నాలు చేస్తుండడం తెలిసిందే. తప్పుకోవడానికి తానూ రెడీ అని యడ్డి చెప్పడంతో సెగలు రేగాయి.

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుణ్‌ సింగ్, సీఎం యడియూరప్ప, మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు విషయంపై స్పందించా, కొత్తగా చెప్పేందుకు ఏమి లేదని అరుణ్‌సింగ్‌ అన్నారు. తమ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉన్నారని చెప్పారు. నేతల మధ్య విభేదాలు ఉంటే మీడియా ముందు కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని సూచించానని తెలిపారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top