
భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రతీతి
ప్రపంచంలోనే ఎత్తైన గణేష్ విగ్రహంగా పేరు
కోలారు: జిల్లాలోని ముళబాగిలు తాలూకాలోని కురుడుమలై గ్రామంలో వెలసిన వినాయకుడు భక్తులకు కోరిన వరాలను అందిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాలలో మొదటిదిగా గుర్తింపు పొందిన కురుడుమలై వినాయకుడు పురాణ ఇతిహాసం కలిగి ఉన్నాడు. 18 అడుగుల ఎత్తు కలిగి సాలిగ్రామ శిలతో తయారు చేసిన ఈ వినాయక విగ్రహాన్ని కృతయుగంలో త్రిమూర్తులు స్థాపించారని ప్రతీతి. త్రిమూర్తులు కలిసిన ప్రదేశం కాబట్టి దీనిని తొలుత కూటాద్రి అని, కాలక్రమంలో కూడుమలై అని, అనంతరం కురుడుమలైగా మారిందని పురాణ ఇతిహాసాల్లో ఉంది. రామాయణంలో రాముడు రావణ సంహారానికి ముందు కురుడుమలై వినాయకుడిని దర్శించి పూజలు చేసిన అనంతరం యుద్ధానికి వెళ్లాడని రామాయణంలో చెప్పారు.
పూజిస్తే ఇక విజయమే..
ద్వాపర యుగంలో శమంతకమణిని అపహరించినట్లు తనపై వచ్చిన అపవాదును తొలగించుకోడానికి శ్రీకృష్ణుడు కురుడుమలై వినాయకుడిని పూజించాడని చెప్పారు. అదేవిధంగా పంచపాండవులు, అర్జునుడు ఈ వినాయకుడిని పూజించి యుద్ధాలకు వెళ్లి విజయాలు సాధించారనే ప్రతీతి ఉంది. ఆ నమ్మకంతోనే నేటి రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లే ముందు కురుడుమలై వినాయకుడికి పూజలు చేసి అనంతరం ప్రచారం చేస్తే విజయం తప్పకుండా సిద్ధిస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. సర్పదోషాలు కలిగిన వారు ఇక్కడ పూజలు చేస్తే దోష నివారణ అవుతుందనే నమ్మకం ఉంది. అదేవిధంగా కలియుగంలో శ్రీకృష్ణదేవరాయలు వినాయకుడికి పూజలు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేశారని చరిత్ర చెబుతోంది.
అమ్మవారి ముందు వేడుకుంటే క్షమే..
అక్కడే క్షమదాంబ అమ్మవారి ఆలయం ఉంది. ప్రపంచంలోనే ఈ పేరు కలిగిన అమ్మవారి ఆలయం లేదని ప్రతీతి. తెలియక చేసిన తప్పులను అమ్మవారి ముందు వేడుకుంటే క్షమిస్తుందనే నమ్మకం ఇక్కడ ఉంది. పూర్వం కౌండిన్య మహర్షి దగ్గరలో ఉన్న పర్వతంపై తపస్సు చేశారని, అందుకే దానికి కౌండిన్య క్షేత్రమని పేరు వచ్చిందంటారు. కౌండిన్య నది ఇక్కడే పుట్టి పాలార్ నదిలో కలుస్తుంది. కరుడుమలై క్షేత్రంలో భక్తుల కోసం జిల్లా యంత్రాంగం సరైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం యాత్రి నివాస్‌ను నిర్మించింది. దేవాలయంలో ప్రధాన అర్చకులు శంకర్ దీక్షితులు, విశ్వనాథ దీక్షితులు నిత్యం పూజాధికాలను నిర్వహిస్తుంటారు.
ఇదీ చదవండి: Vithika sheru బొజ్జ గణపయ్య మేకింగ్ వీడియో వైరల్
ఐదు రోజుల పాటు విశేష పూజలు
ప్రతియేటా గౌరీ పండుగ నుంచి మొదలుకుని వినాయక చవితి వరకు ఐదు రోజుల పాటు దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. వినాయక చవితి రోజున పంచామృతాభిషేకం మొదలుకుని ప్రత్యేక పూజలను, సాయంత్రం కళ్యాణోత్సవం నెరవేరుస్తారు. పండుగ మరుసటి రోజున స్వామి బ్రహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. షష్టి రోజున వసంతోత్సవం, సప్తమి పల్లకీ ఉత్సవం, ఐదవ రోజు అష్టమి శయనోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. కురుడుమలై గ్రామంలోనే చోళుల కాలంలో నిర్మించిన సోమేశ్వరస్వామి ఆలయం ఉంది.
కురుడుమలైకి ఎలా వెళ్లాలి?
అత్యంత పురాణ ఇతిహాసం కలిగిన కురుడుమలై వినాయకుడి ఆలయం ముళబాగిలు తాలూకా కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముళబాగిలు నుంచి ప్రతి అరగంటకు ఓ బస్సు సౌకర్యం ఉంది. బెంగళూరు నుంచి వచ్చే వారు కోలారు మీదుగా ముళబాగిలు వెళ్లి అక్కడి నుంచి కురుడుమలై వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి నుంచి వస్తే తిరుపతి–బెంగళూరు మార్గమధ్యంలో ముళబాగిలులో దిగి కురుడుమలైకి వెళ్లాల్సి ఉంటుంది.