
సాక్షి ముంబై: సాధారణంగా వినాయక చవితి తరువాత ఒకటిన్నర, మూడు, అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజులకు వినాయక నిమజ్జనం చేస్తారు. కానీ మహారాష్ట్ర నాందేడ్ జిల్లా భోకర్ తాలూకాలోని పాలజ్ గ్రామంలో గత 77 ఏళ్లుగా నిమజ్జనమనే మాటే లేకుండా గణేశోత్సవాలు నిర్వహిస్తున్నారు. కలపతో తయారు చేసిన ఈ గణపతి విగ్రహానికి ఎంతో చరిత్ర, ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిని గురించి ఆ గ్రామ గణపతి మండలి సభ్యులు వెంకటేష్, నాగభూషణ్, సాయినాథ్ తదితరులు ‘సాక్షి’కి వివరించారు.
కలలో వినాయకుడి ఆదేశం..
తెలంగాణ, మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో 90 శాతం మంది తెలుగు వారే నివసిస్తున్నారు. ఓ రోజు పాలజ్ గ్రామ పంచాయితీ ప్రముఖుడు సంటి భోజన్నకు కలలో వినాయకుడు దర్శనమిచ్చి గణేశోత్సవాలు జరపమని కానీ నిమజ్జనం చేయవద్దని చెప్పారట. ఈమేరకు సంటి భోజన్న, సకెలవార్ చిన్నన్న, గంగాధర్ చటపలవార్, నరసింగ్‌రావ్ దేశ్‌ముఖ్, నరసిమల్లు చాటలవార్, మల్లయ్య బాందేలవార్ తదితరులు వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కొయ్యబొమ్మలకు ఎంతో ప్రసిద్ది చెందిన తెలంగాణలోని నిర్మల్‌కు చెందిన శిల్పి గుండాజి పాంచల్‌కు విగ్రహ తయారీ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఒకే చెట్టు కలపతో ఈ ప్రతిమను తయారు చేశారు.
భారీ సంఖ్యలో భక్తుల రాక...
అలా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయమని, కలరా, ప్లేగు లాంటి మహామ్మారి వ్యాధుల బారి నుంచి కాపాడమని వేడుకుంటూ 1948లో ఈ వినాయకుడిని ప్రతిష్టించారు. ఇలా ఈ వినాయకున్ని 1948లో గ్రామంలో స్థాపించారు. అనంతరం వారాసించినట్లుగానే స్వతంత్రం వచ్చింది. కలరా, ప్లేగు వ్యాధులు కూడా నశించాయి. అప్పటి నుంచి ప్రతి ఏడాది 11 రోజులపాటు పెద్ద ఎత్తున గణేశోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ నిమజ్జనం చేయడం లేదని గణపతి మండలి సభ్యులు వివరించారు. నిమజ్జన శోభాయాత్ర నిర్వహించి కొన్ని నీళ్లు విగ్రహంపై చల్లి మళ్లీ యథావిధిగా భద్రపరచడం ఆనవాయితీ కొనసాగుతోందని చెప్పారు.
చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత!
కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో ఇక్కడికి మహరాష్ట్రతోపాటు తెలంగాణకు చెందిన భక్తులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారని, ముడుపులు కట్టి కోరికలు తీరిన తరువాత ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లతోపాటు 11 రోజులపాటు ప్రతి రోజు అన్నదానం, భజనలు, కీర్తనలు ఇతర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండలి సభ్యులు తెలిపారు. రద్దీ కారణంగా అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసు భద్రత (Police Security) కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.