
వరంగల్ శివనగర్‌లోని వాసవి కాలనీలో వినాయక ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మట్టి విఘ్నేశ్వరుడిని శుక్రవారం రాత్రి కోటీ యాభై మూడు లక్షల, నూట పదహారు రూపాయల కరెన్సీతో అలంకరించారు. సుమారు 200 మందికిపైగా ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రతి నిధులు, కాలనీవాసులు ఈ కరెన్సీని అందజేశారు. ఈ కార్యక్రమంలో వినాయక ట్రస్టు భవనం అధ్యక్షుడు సాదుల దామోదర్, కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, కోశాధికారి రావికంటి అశోక్ పాల్గొన్నారు.
– ఖిలా వరంగల్

గణపతి.. ధనపతి
మంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథస్వామి ఆలయ కాలక్షేప మండపంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. శుక్రవారం రాత్రి రూ.25,11,116 కరెన్సీ నోట్లతో మండపాన్ని తీర్చిదిద్దారు. భక్తులు కరెన్సీ గణపతిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

ధననాథుడు
గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజారులో ఆర్యవైశ్య సంఘం, సంకా బాలాజీ గుప్తా యూత్, స్థానిక వ్యాపారుల సహకారంతో ఏర్పాటు చేసిన గణనాథుడు శుక్రవారం ‘ధన’నాథుడుగా దర్శనమిచ్చాడు. ఉత్సవ నిర్వాహకులు రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
– మంగళగిరి టౌన్

వినాయక లడ్డు, కలశం @రూ.49 లక్షలు
ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం అయ్యలూరివారిపల్లెలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 3వ రోజు శుక్రవారం గణపతి మండపం వద్ద నిర్వహించిన లడ్డు, కలశం వేలంలో లడ్డు రూ.30 లక్షలు, కలశం రూ.19 లక్షలు పలికింది. వేలంలో లడ్డును అదేగ్రామానికి చెందిన పాలుగుళ్ల మోహన్‌రెడ్డి, కవిత దంపతులు రూ.30,00,116కు దక్కించుకోగా, కలశాన్ని అదేగ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నారాయణరెడ్డి, సర్పంచ్ ముత్యాల భారతీరెడ్డి దంపతులు రూ.19.10 లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు.
– సీఎస్‌పురం (పామూరు)