ఉదయనిధికి సీఎం విజయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | CM Vijay Counter To Udhayanidhi Stalin Horse Trading Allegations In Assembly, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

ఉదయనిధికి సీఎం విజయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

May 13 2026 12:09 PM | Updated on May 13 2026 12:46 PM

CM Vijay Counter To Udhayanidhi Stalin Horse Trading Allegations

సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త అసెంబ్లీలో పొలిటికల్‌ పంచులు పేలడం అప్పుడే ప్రారంభమైంది. టీవీకే ప్రభుత్వ బలనిరూపణ వేళ.. ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలకు దిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం విజయ్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు సీఎం విజయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.  

ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ బలనిరూపణ చర్చ వేళ విమర్శలు గుప్పించారు. ‘‘65 శాతం ఓటర్లు విజయ్‌ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. 

టీవీకే హార్స్‌ ట్రేడింగ్‌కు పాల్పడింది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్‌ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు’’ అని ఆరోపించారాయన.  ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్‌ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం టీవీకే తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్‌ చేశారు. 

ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్‌ ప్రసంగించారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. 

.. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు. మున్ముందు ఆ ప్రయత్నం చేయబోం. మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. కాబట్టి వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

ఏ పార్టీ అనేది చూడం.. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం.  అలాగే గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్‌ టీవీకే సర్కార్‌ నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement