కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు! | CM Revanth Reddy Fires On Kishan Reddy | Sakshi
Sakshi News home page

కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు!

Jun 16 2026 4:42 AM | Updated on Jun 16 2026 4:42 AM

CM Revanth Reddy Fires On Kishan Reddy

సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు

మెట్రో తొలిదశ స్వా«దీనం, రెండో దశ ప్రాజెక్టుపై కుట్రపూరితంగా వ్యవహరించారు 

మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణ

ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రూ.13,600 కోట్ల రుణం రాకుండా చేశారు 

రెండోదశ ప్రాజెక్టుకు 50 శాతం నిధులు ఇవ్వకుంటే కేంద్రం ఎన్‌ఓసీ ఇవ్వాలని డిమాండ్‌ 

ప్రధాని మోదీ రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేస్తానని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా, రా ష్ట్రంలో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు చేపట్టకుండా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కుట్రపూరితంగా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘ఒప్పందం ప్రకారం తొలి దశ ప్రాజెక్టు స్వాదీనానికి ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి అవసరమైన రుణం విడుదలకు జూన్‌ 15 చివరి రోజు. బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఈ రోజు కిషన్‌రెడ్డి రుణం విడుదల చేయిస్తడా? చేయించడా? చివరకు రిజర్వ్‌ బ్యాంకు నుంచీ గ్యారెంటీ తెచ్చి ఇచ్చాం. ఇక ఫిట్టింగ్‌ పెట్టడానికి ఏం లేదు. రుణం ఆపడానికి కారణం ఏమిటో చెప్పండి. రుణం విడుదల చేయించడానికి మీరు మాట్లాడతరా? మాట్లాడరా? రెండో విడత మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు 50 శాతం నిధుల వాటాతో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు వస్తదా? రాదా? ముందుకు రాకపోతే రాష్ట్రమే పూర్తి వ్యయంతో కట్టుకోవడానికి కేంద్రం ఎన్‌ఓసీ ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్, అహ్మదాబాద్, వైజాగ్‌కు కూడా మెట్రో ఇచ్చారు. విశ్వనగరం హైదరాబాద్‌కు ఇవ్వడం లేదంటే వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం  సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఎన్‌వోసీ ఇస్తే మీ వాటా అవసరం లేదు.. 
‘మెట్రో తొలి దశ ప్రాజెక్టు స్వా«దీనానికి అవసరమైన రుణం కోసం ఐఆర్‌ఎఫ్‌సీని ఒప్పించి అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. మే 30 నాటికే అప్పు విడుదల కావాలి. జూన్‌ 1 నుంచి మెట్రోను పూర్తిగా ఎల్‌అండ్‌టీ నుంచి స్వా«దీనం చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వం పెట్టుబడి వాటాగా రూ.1,400 కోట్ల మార్జిన్‌ మనీతో పాటు రూ.84 కోట్ల పేపర్‌ ఫీజు కట్టింది. ఐఆర్‌ఎఫ్‌సీ రూ.13,600 కోట్ల రుణం విడుదల చేయాల్సి ఉండగా, కరెక్టుగా ఈ సమయంలోనే (గతనెల 20న) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్, 21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన కిషన్‌రెడ్డి.. ఇంత సులువుగా మీరు రేవంత్‌రెడ్డికి అప్పులు ఇస్తే తెలంగాణలో బీజేపీ ఉండాలా? మూసివేయాలా? అని తిరకాసు పెట్టడంతో రుణం విడుదల చేయకుండా కేంద్రం పీటముడి వేసుకుని కూర్చుంది.’ అని సీఎం ఆరోపించారు. ‘రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఎన్‌వోసీ ఇస్తే ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి 4 శాతం వడ్డీతో మళ్లీ రూ.40 వేల కోట్ల రుణం తెచ్చుకుంటాం. మీ 50 శాతం నిధుల వాటా అవసరం లేదు..’ అని రేవంత్‌ అన్నారు. 

బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలు 
‘ఎవరితో సంబంధం లేకుండా రేవంత్‌రెడ్డి 122 కి.మీ.ల మెట్రో కట్టుకుంటే మోదీ, కిషన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం గురించిన చర్చ ఉండదు. అప్పుడు రాజకీయంగా నష్టం వస్తుందనే ఆలోచనతో ఎక్కడికక్కడ ఛిన్నాభిన్నం చేయడానికి బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ఖట్టర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు కిషన్‌రెడ్డి నన్నెందుకు తీసుకునిపోడు?  వరంగల్‌ ఎయిర్‌పోర్టు కొలిక్కి వచ్చాక కేంద్రమంత్రి రాంమోహన్‌ నాయుడిని కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు? అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు?..’ అని సీఎం నిలదీశారు.  

కేసీఆర్‌ వల్ల రూ.7 వేల కోట్ల నష్టం 
‘నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2009లో మెట్రో రైలు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వైఎస్‌ అకాల మరణం తర్వాత నాటి సీఎం రోశయ్య రూ.15 వేల కోట్లతో 70 కి.మీ.ల కారిడార్‌తో 2017లోగా మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేయడానికి ఎల్‌అండ్‌టీ సంస్థతో పీపీపీ విధానంలో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. అయితే 2014లో కేసీఆర్‌ సీఎం అయ్యాక చారిత్రిక కట్టడాల పేరుతో మూడు మార్గాల్లో అలైన్‌మెంట్‌ మార్చాలని ఎడతెగని పేచీ పెట్టడంతో పనులు ఆలస్యమై 2020కి కానీ పూర్తి కాలేదు. మూడేళ్ల జాప్యంతో వ్యయం రూ.22వేల కోట్లకు పెరిగింది. 

షరతులపై షరతులు పెట్టిన కేంద్రం 
మెట్రో రైలు రెండో దశకు అనుమతి, నిధులివ్వాలని మేము అధికారంలోకి వచ్చాక ప్రధాని, కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే, ఆర్థిక శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశా. ఎల్‌అండ్‌టీని భాగస్వామిని చేస్తేనే అనుమతిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌  షరుతు పెడితే ఎల్‌అండ్‌టీ తిరస్కరించింది. గత ప్రభుత్వం పనులు స్తంభింపజేయడంతో రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకోవాలంటూ కేంద్రం మరోసారి మెలిక పెట్టగా, ఆ సంస్థ మళ్లీ తిరస్కరించింది. దీంతో ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైలు కొనుగోలే ఏకైక ప్రత్యామ్నాయం అని కేంద్రం చెప్పింది. ఇందుకు ఎల్‌అండ్‌టీని ఒప్పించి, మంత్రివర్గంలో, అసెంబ్లీలో చర్చించి ఆమోదించాం..’ అని సీఎం వివరించారు. 

నేను అండగా ఉంటా కేసీఆర్‌ను భయపెట్టు 
‘రెండో దశ విస్తరణకు 50శాతం నిధుల వాటా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుందని కిషన్‌రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవముంటే కాగితం చూపించాలి. తెలంగాణ తరఫున కేంద్ర కేబినెట్‌ ర్యాంకు మంత్రివి నువ్వు ఒక్కడివే. మంత్రివర్గం భేటీలో పీఎం మోదీతో నువ్వే మాట్లాడాలి. కేసీఆర్‌కు భయపడి, లొంగిపోయి కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. నేను నీకు అండగా నిలబడతా కేసీఆర్‌ను భయపెట్టు. కిషన్‌రెడ్డికి అంత తెలివి లేదు. ఆయన వెనుక కేటీఆర్‌ ఉన్నాడు. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్‌ అపరిచితుడి వేషం వేసుకుని అందరినీ బెదిరించినట్టు.. ‘నీ సంగతి చూస్తా ’అని రామచందర్‌రావు నన్ను బెదిరిస్తుండు. నేను భడేభాయ్‌(మోదీ)ను కూడా కలిసా. కింద(రాష్ట్రంలో) సమస్యలుంటాయి..అవి ఏందో చూడు అన్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు చాలా మందిని కలిసి వచ్చిన. వారితో జరిగిన చర్చను బయటపెట్టడం అనైతికమని కొన్ని విషయాలు చెప్పుకోదలుచుకోలేదు..’ అని రేవంత్‌ అన్నారు.   

కేంద్రం ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది.. 
హామీలు అమలు చేయని సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలని కిషన్‌రెడ్డి చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ‘మూడు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీల్లో ఏదీ మోదీ అమలు చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిజికల్లీ హ్యాండీకాప్డ్‌ (వికలాంగ ప్రభుత్వం). ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది. స్పష్టమైన మెజారిటీ లేదు. నాకు పూర్తి మెజారిటీ ఉంది. ఎవరిపై ఆధారపడలేదు. నన్ను రిజైన్‌ చేయమని అడిగే నైతిక హక్కు వారికి లేదు. అయినా మోదీ చేస్తే నేనూ రాజీనామా చేయడానికి సిద్ధం..’ అని సీఎం స్పష్టం చేశారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement