ప్రస్తుతానికి ‘అడ్‌హాక్‌’ కమిటీలే | CM KCR Ongoing Meetings With Northern States Leaders | Sakshi
Sakshi News home page

ప్రస్తుతానికి ‘అడ్‌హాక్‌’ కమిటీలే

Feb 8 2023 3:21 AM | Updated on Feb 8 2023 8:39 AM

CM KCR Ongoing Meetings With Northern States Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ కార్యకలాపాల విస్తరణకు సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల్లో కాలుమోపేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఆయన... వారికి ఆయా రాష్ట్రాల్లో పార్టీ పగ్గాలు అప్పగించడంపై భిన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించిన కేసీఆర్‌... ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతానికి అడ్‌హాక్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గత నెలలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌కు పార్టీ ఒడిశా పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ కేసీఆర్‌ మాత్రం అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. పార్టీలోకి చేరికల వేగం పెరిగాక సమర్థులైన నేతలకు ఆయా రాష్ట్రాల బీఆర్‌ఎస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆయన భావిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతానికి ఒడిశా, మహారాష్ట్ర శాఖలకు అడ్‌హాక్‌ కమిటీలను ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెలాఖరులో భువనేశ్వర్‌లో సభ...
బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత ఖమ్మం, నాందేడ్‌ బహిరంగ సభలు విజయవంతం కావడంతో మరిన్ని సభల నిర్వహణకు కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 17న తెలంగాణ సచివాల­యం ప్రారంభోత్సవం అనంతరం పరేడ్‌ మైదా­నంలో భారీ బహిరంగ సభను నిర్వహించనుండగా ఈ నెల 25 తర్వాత ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ముగి­శాక ఒడిశాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలతో భేటీకి కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

ఈ భేటీలో భువనేశ్వర్‌ సభ ఏర్పాట్ల గురించి దిశానిర్దేశనం చేయనున్నారు. ఇప్పటికే సభ నిర్వహణ ఏర్పాట్ల సమన్వయ బాధ్యతను ఒడిశాలోని బరంపురానికి చెందిన ఓ నేతకు  అప్పగించినట్లు తెలిసింది. మరోవైపు మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రైతుసంఘాల నేతలు కేసీఆర్‌తో వరుస భేటీలు జరుపుతున్నట్లు సమాచారం.

అయితే హైదరాబాద్‌కు వారి రాక, బీఆర్‌ఎస్‌లో చేరికకు సంబంధించి గోప్యత పాటిస్తున్నారు. ప్రగతిభవన్‌ సమీపంలోని రెండు స్టార్‌ హోటళ్లలో ఆయా నేతలు, ఇతరులకు బీఆర్‌ఎస్‌ బస ఏర్పాట్లు చేస్తోంది. సమయానుకూలతను బట్టి వారు కేసీఆర్‌తో భేటీ కావడంతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement