CM Jagan: కొత్త వ్యూహాలతో.. ప్రత్యర్థులకు సర్రున కాలేలా..

CM Jagan At Kamalapuram Satirical Speech Pawan Kalyan, Chandrababu - Sakshi

రాజకీయాలలో ఒక్క డైలాగు చాలు సర్రున కాలడానికి. ఒక్క మాట చాలు మొత్తం కథ బయటపెట్టడానికి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో జరిగిన సభలో చేసిన కామెంట్లు అంత పవర్ పుల్‌గా ఉన్నాయని చెప్పాలి. చూడండి.. ఆయన ఎలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారో.. ఈ రాష్ట్రం కాకపోతే, మరో రాష్ట్రమని, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని చంద్రబాబులా, ఆయన దత్తపుత్రుడు మాదిరి ఈ భార్య కాకపోతే మరో భార్య అని తాను అననని జగన్ పేర్కొన్నారు. ఒక్క పదంలో ఎన్ని అర్దాలు వచ్చేలా ఆయన ప్రసంగించారో అర్దం అవుతోంది కదా!

చంద్రబాబు ఇటీవల తెలంగాణలో టిడిపిని పునరుద్దరిస్తానంటూ సభలు పెడుతున్న వైనాన్ని సుత్తి లేకుండా సూటిగా ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని ఆయన అంటున్నారని చెప్పడం ద్వారా చంద్రబాబు  ఏపీపై ఆశలు వదలుకున్నారని చెప్పినట్లయింది.అందుకే మళ్లీ తెలంగాణ వైపు వెళ్లారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఎటూ టిడిపికి భవిష్యత్తు లేదని, ఇక ఎపిలో కూడా పరిస్థితి అంతేనని ఆయన చెప్పదలిచారని అనుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్‌కు సంబంధించి వ్యక్తిగత జీవితంపై ఉన్న విమర్శలు,తాజాగా ప్రచారం అవుతున్న కధనాలను బహుశా దృష్టిలో ఉంచుకుని యధాప్రకారం చంద్రబాబు దత్తపుత్రుడిగా అభివర్ణిస్తూ దాడి చేశారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తనను, వైసిపి నేతలను ఉద్దేశించి చేస్తున్న పరుష, వ్యక్తిగత వ్యాఖ్యలకు జగన్ జవాబు ఇచ్చినట్లయిందనుకోవాలి. ఈ ఫ్రంట్‌లో చంద్రబాబు, పవన్‌లు ఇద్దరూ బలహీనంగానే ఉన్నారని చెప్పవచ్చు.

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో పార్టీలు మార్చడం కాని, కూటములు మార్చడం కాని పలుమార్లు చేశారు. 1978లో కాంగ్రెస్ ఐ తరపున ఎన్నికైన ఆయన 1983లో టిడిపి అదికారంలోకి రావడంతోనే మామ ఎన్టీఆర్ పంచన చేరారు. 1995లో ఆయన ఎన్టీఆర్‌నే కూలదోసి అధికారంలోకి వచ్చారు. 1996లో వామపక్షాలతో కలిసి ప్రంట్ కట్టారు. 1998లో బిజెపి ఆద్వర్యంలోని ఎన్డీఏలోకి జంప్ చేశారు. 2004 ఓటమి తర్వాత జన్మలో బిజెపితో కలవనని శపధం చేశారు. 2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. తదుపరి 2014లో మళ్లీ వామపక్షాలకు ఝలక్ ఇచ్చి బిజెపి ప్రధాని అభ్యర్దిగా ఉన్న నరేంద్ర మోడీని బతిమలాడుకుని తిరిగి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.

2018 లో బిజెపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, సిపిఐ, టిజెఎస్‌లతో కలిసి కూటమి కట్టి తెలంగాణలో పరాజయం చెందారు. 2019లో ఒంటరిగా పోటీచేసినా, పరోక్షంగా జనసేనతో సంబందాలు ఏర్పాటు చేసుకున్నారు. 2024 నాటికి మరోసారి జనసేన, బిజెపిలతో పొత్తు కోసం అర్రులు చాస్తున్నారు. దీనినంతటిని జగన్ ఒక్కమాటలో చెప్పేశారు. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అని చంద్రబాబు మాదిరి వెంపర్లాడబోనని నిక్కచ్చిగా జగన్ చెప్పేశారన్నమాట. ఇక ఇటీవలికాలంలో  పవన్ కళ్యాణ్ చాలా అసహనంగా  వైసిపిపైన , జగన్ పైన విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న దూషణలను ఆయన కూడా కొనసాగిస్తున్నారు. వాటన్నిటికి సమాధానంగా పవన్ వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాన్ని మరోసారి ప్రజల దృష్టికి తీసుకు వచ్చారన్నమాట.

అంతేకాక పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మీరు కూడా ఎన్ని పెళ్లిళ్లు కావాలంటే అన్ని చేసుకోండని చేసిన వ్యాఖ్య కూడా ఆయనను ఆత్మరక్షణలో పడేసింది. దీనిని గమనంలోకి తీసుకుని జగన్ డైలాగు విసిరారనుకోవాలి. ఈ రకంగా వన్ షాట్ టు బర్డ్స్ అన్నట్లుగా జగన్ దెబ్బకొట్టారన్నమాట. ఇక అదే సమయంలో తన గురించి కూడా ఆయన చెబుతూ, ఇదే నా రాష్ట్రం, నా నివాసం, ఐదు కోట్ల మంది ప్రజలే తన కుటుంబం, ఇక్కడే నా రాజకీయం,ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే తన విధానం  అంటూ సెంటిమెంట్ తో కూడిన వ్యాఖ్య చేశారు.  

ఈ సందర్భంగా  కూడా పరోక్షంగా చంద్రబాబు, పవన్‌లు ఇప్పటికీ తెలంగాణలోనే నివాసం ఉంటున్న నేపధ్యంలో జగన్ మరో చురక  అంటించారన్నమాట. నాయకుడు అంటే విశ్వసనీయత కలిగి ఉండాలని, తను అధికారంలోకి వచ్చాక 98 శాతం ఎన్నికల మానిఫెస్టోని అమలు చేశానని ఆయన వివరించారు. జగన్ మొత్తం మీద ప్రతి బహిరంగ సభలోను కొత్త, కొత్త వ్యూహాలతో తన రాజకీయ ప్రత్యర్ధులకు గట్టి జవాబే ఇస్తున్నారు. చంద్రబాబుకాని, పవన్ కళ్యాణ్ కాని గంటలకొద్దీ మాట్లాడుతూ జగన్‌ను, వైసిపిని విమర్శిస్తుంటారు. అందుకు ప్రతిగా ఒకటి, రెండు డైలాగులతో జగన్ వారిని డిఫెన్స్‌లో పడేస్తున్నారన్నమాట.
- హితైషి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top