Delhi Budget: ‘మీకెందుకంతా కోపం మోదీజీ.. ప్లీజ్‌ ఢిల్లీ బడ్జెట్‌ ఆపొద్దు’.. మోదీకి కేజ్రీవాల్‌ లేఖ

CM Arvind Kejriwal Writes To PM Over Delhi Budget - Sakshi

న్యూఢిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఢిల్లీ బడ్జెట్‌ విషయంలో రెండు వర్గాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా రాజకీయ పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. దయచేసి ఢిల్లీ బడ్జెట్‌ను ఆపవద్దని లేఖలో కోరారు. 

75 ఏళ్ల స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో రాష్ట్ర బడ్జెన్‌ను కేంద్రం అడ్డుకోవడం ఇదే తొలిసారి. ఢిల్లీ ప్రజల పట్ల మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌ను ఆమోదించమని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీలో నేడు(మంగళవారం) బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది.

అయితే బడ్జెట్‌ ప్రతిపాదనలను కేంద్రం అడ్డుకోవడంతో అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం లేదని కేజ్రీవాల్‌ తెలిపారు. ‘ఈ రోజు నుంచి ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, టీచర్లకు జీతాలు అందవు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న గూండాయిజం’ అని ఆరోపించారు. 

కాగా బ​డ్జెట్‌లో ప్రకటనలకు అధిక కేటాయింపులు, మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ నిధులు కేటాయించడంపై ఆప్‌ ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. వీటికి సమాధానం చెబుతూ బడ్జెట్‌ ప్రతులను మళ్లీ పంపాలని మార్చి 17నే లేఖ రాసినట్లు పేర్కొంది. నాలుగు రోజులుగా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.

దీనిపై స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం.. అయితే ప్రకటనలపై కేటాయింపులు పెంచలేదని, గతేడాది మాదిరిగానే ఉందని పేర్కొంది. మొత్తం రూ.78,800 కోట్ల బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కోసం 22,000 కోట్లు, ప్రకటనల కోసం రూ. 550 కోట్లు కేటాయించినట్లు  తెలిపింది. అయితే హోంశాఖ లేఖను ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ మూడు రోజులు దాచిపెట్టారని మనీష్‌ సిసోడియా అరెస్ట్‌ అనంతరం ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కైలాశ్‌ గెహ్లోత్‌ ఆరోపించారు. 

ఈ విషయం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలిసిందన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు తనకు బడ్జెట్ ప్రతిపాదన ఫైల్ అందిందని, రాత్రి 9 గంటలలకు హోం మంత్రిత్వ శాఖ ఆందోళనలకు స్పందించి ఫైల్‌ను తిరిగి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు సమర్పించానని చెప్పారు. ఢిల్లీ బడ్జెట్‌ను ఆలస్యం చేయడంలో ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి పాత్రపై దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ బడ్జెట్‌ లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద నిలిచిపోయింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top