నా రిపోర్టుతోనే డిజిటల్‌ కరెన్సీ 

Chandrababu in TDP 41st Formation Day - Sakshi

గతంలో నేనిచ్చిన రిపోర్టు ఆధారంగానే వాజ్‌పేయి సెల్‌ఫోన్లు తెచ్చారు 

అవినీతి పోవాలంటే 500, 1,000, 2,000 నోట్లను రద్దు చేసి డిజిటల్‌ కరెన్సీ తేవాలి 

విజన్‌–2047 రిపోర్టు తయారు చేయాలని జీ–20 సమావేశంలో మోదీకి చెప్పా.. 

25 ఏళ్ల కిందటి నా కృషి వల్లే నేడు హైదరాబాద్‌ రూపురేఖలు మారాయి 

టీడీపీ 41వ ఆవిర్భావ సభలో చంద్రబాబు 

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘ఐటీ విషయంలో నీకు బాగా అనుభవం ఉంది. డిజిటల్‌ కరెన్సీ మీద రిపోర్టు ఇవ్వు అని ప్రధాని మోదీ అడిగితే రిపోర్టు ఇచ్చాను. నేనిచ్చి న రిపోర్టు ఆధారంగానే డిజిటల్‌ కరెన్సీని తెచ్చారు. ఈరోజు కూరగాయల దుకాణం నుంచి ఎక్కడ చూసినా డిజిటల్‌ కరెన్సీ ఉంది. అలాగే 500, వెయ్యి, రెండు వేల నోట్లు రద్దు చేసి డిజిటల్‌ కరెన్సీని డెవలప్‌ చేద్దామని చెప్పాను. అది వస్తే దేశ ఆదాయం పెరుగుతుంది..’’అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగానే తన గురించి చెప్పుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో పెద్దనోట్లను రద్దు చేసి, డిజిటల్‌ కరెన్సీని అభివృద్ధి చేయాలని, అప్పుడే అవినీతి పోతుందని చెప్పారు. 

నా వల్లే సెల్‌ఫోన్లు వచ్చాయి: గతంలో తాను ఇచ్చి న రిపోర్టు ఆధారంగానే వాజ్‌పేయి టెలికం రంగంలో సంస్కరణలు తెచ్చారని, సెల్‌ఫోన్లు వచ్చాయని అన్నారు. ఇటీవల ఓ సమావేశంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు విజన్‌–2027 రిపోర్టు తయారు చేయాలని.. దానితో ప్రపంచంలో భారత్‌ నంబర్‌ వన్‌ అవుతుందని చెప్పానని వివరించారు. అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ టీడీపీ అని, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ద్వారా అంటరాని తనం లేకుండా చేశానని అన్నారు. మొదటి నేషనల్‌ హైవే తెలుగుదేశం హయాంలోనే వచ్చిందన్నారు.

1995లో తాను సీఎం అయిన తర్వాతే రంగారెడ్డి జిల్లాలో, రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారం కావాలని ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాలేదని, తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకే పార్టీ పెట్టారన్నారు. త్వరలో రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ తెలుగు సినీ రంగానికి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ సభలో పార్టీ తెలంగాణ, ఏపీల అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, అచ్చెన్నాయుడు, నందమూరి రామకృష్ణ, పార్టీ ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top