సంతకం పెట్టని టీడీపీ

Chandrababu Naidu Dual Face Behaviour On Visakhapatnam Steel Plant Privatisation - Sakshi

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో చంద్రబాబు ద్వంద్వ నీతి బట్టబయలు

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ పోరాటం

వైఎస్సార్‌సీపీతోపాటు వివిధ పార్టీలకు చెందిన 120 మంది ఎంపీల

సంతకాల సేకరణ ప్రధానికి ఇచ్చే ఆ వినతిపత్రంపై 

సంతకాలు చేసేందుకు టీడీపీ ఎంపీల నిరాకరణ

సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను టీడీపీ సమర్థిస్తోందా? నిరసన కార్యక్రమాలు బూటకమేనా? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ద్వంద్వ నీతిని మరోసారి బయట పెట్టుకున్నారా? అనే ప్రశ్నలకు ఆ పార్టీ ఎంపీల తీరు అవుననే సమాధానం ఇస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ (ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించేలా) కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చే వినతిపత్రంపై సంతకం చేయాలని టీడీపీ ఎంపీలు కె.రామ్మోహన్‌నాయుడు, కేసినేని నాని, గల్లా జయదేవ్, కె.వరప్రసాద్‌లను వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డి కోరారు.

ఆ వినతిపత్రంలో లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్షాల్లో వైఎస్సార్‌సీపీతోపాటు డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఐ, శివసేన, ఐయూఎంఎల్, ఆర్జేడీ, బీజేడీ, సీపీఎం, ఎన్‌సీపీ, ఎన్‌సీ, ఎంఐఎం, ఆర్‌ఎల్పీ, ఆర్‌ఎస్పీ,  కేసీ(ఎం) తదితర పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా సంతకాలు చేసి, మద్దతు తెలిపారు. కానీ.. టీడీపీ ఎంపీలు మాత్రం సంతకాలు చేయడానికి నిరాకరించారు. దీన్ని బట్టి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ చేస్తున్న కార్యక్రమాలన్నీ బూటకమేనని స్పష్టమవుతోందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు టీడీపీ అంగీకరించినట్లే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

ఆదినుంచి వైఎస్సార్‌సీపీ పోరాటం 
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆదిలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.  స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ అధీనంలో లాభసాటిగా నడిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. వైఎస్సార్‌సీపీ ఇటు క్షేత్ర స్థాయిలో, అటు పార్లమెంట్‌లో తన వాణి గట్టిగా వినిపిస్తోంది.

ఇందులో భాగంగా మిగతా పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మొత్తంగా 120 మంది వినతిపత్రంపై సంతకాలు చేయగా, ఒక్క టీడీపీ మాత్రం నిరాకరించడం గమనార్హం. ఈ వినతిపత్రాన్ని శుక్రవారం విజయసాయిరెడ్డి ప్రధానికి అందజేశారు. దీన్ని బట్టి స్టీల్‌ ప్లాంట్‌పై టీడీపీ ఎంపీలు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చిత్తశుద్ధి ఏ పాటితో స్పష్టమవుతోంది. బీజేపీకి మరింత దూరమవుతామని చంద్రబాబు భయపడే వినతిపత్రంపై సంతకాలు చేయొద్దని టీడీపీ ఎంపీలను ఆదేశించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top