ఘోర అవమానాలతో రగిలిపోతున్న అచ్చెన్న!

Chandrababu Lokesh were not given priority to Atchannaidu in TDP - Sakshi

పేరుకే అధ్యక్ష పదవి .. బీసీ నేతకు ఘోర అవమానాలు 

పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసిన చంద్రబాబు, లోకేశ్‌

అధ్యక్షుడి పనులన్నీ వర్ల రామయ్య ఇతర నేతలతో చేయిస్తున్న వైనం 

మీడియా సమావేశాలు పెట్టడానికీ అనుమతి లేదు 

అడపాదడపా ఒకటి, రెండు సమావేశాలకే పరిమితం 

బాబాయ్‌ని తొక్కిపెట్టి, అబ్బాయి రామ్మోహన్‌ని పైకి లేపుతున్న లోకేశ్‌ 

లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు

చంద్రబాబుదో చిత్రమైన రాజకీయం. నేరుగా పోట్లాడడం ఆయన నిఘంటువులో ఉండదు. మిత్రపక్షంతోనైనా.. స్వపక్షంతోనైనా ఆయన తీరదే. వాడుకుని ముఖం మీద వేడినీళ్లు పోసే రకం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పరిస్థితి దీనికి అద్దం పడుతోంది. 

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్సవ విగ్రహంలా మారారనే చర్చ నడుస్తోంది. పేరుకు అధ్యక్షుడైనా ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడంలేదు.. సరికదా అవమానాలూ తప్పడంలేదు. ఇటీవల చంద్రబాబు తన నివాసంలో పవన్‌ కళ్యాణ్‌తో విందు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మాట వరసకైనా అచ్చెన్నాయుడిని పిలవలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండానే చంద్రబాబు, లోకేశ్‌ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అచ్చెన్నకు తెలియకుండానే ఆయన పేరుతో పార్టీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తనకు కనీస విలువ కూడా ఇవ్వడంలేదని అచ్చెన్న సన్నిహితుల వద్ద వాపోతున్నారు.  

ఆది నుంచి ఉత్సవ విగ్రహమే 
అచ్చెన్నాయుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని బహిరంగంగా పెట్టి, భారీగా నిర్వహించాలని భావించారు. కానీ చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. వెళ్లి కేటాయించిన సీట్లో కూర్చోవాలని చెప్పడంతో చాలా నిరుత్సాహంగా ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఆయనది ఉత్సవ విగ్రహ పాత్రే. కనీసం మీడియా సమావేశాలు కూడా ఇష్ట ప్రకారం నిర్వహించేందుకు అనుమతి లేదు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నా ఆయన కళ్లెదుటే ఇతర నేతలకు అన్ని పనులు అప్పగిస్తున్నారు.

అచ్చెన్నాయుడి కంటే వర్ల రామయ్యకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వివిధ అంశాలపై మీడియా ప్రకటనలు వర్ల రామయ్య పేరుతోనే విడుదల చేస్తున్నారు. పలు అంశాలపై వర్ల రామ­య్యనే పార్టీ ప్రతినిధిగా పంపుతున్నారు. గవర్నర్, ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసేందుకు వర్ల రామయ్య, బొండా ఉమా వంటి నేతలను పంపుతున్నారు తప్ప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పట్టించుకోవడంలేదు. పలు సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు రాసే లేఖలు సైతం వర్ల రామయ్య, లోకేశ్‌ తదితరుల పేర్లతో వెళుతున్నాయి.  

వ్యతిరేకులకు ప్రోత్సాహం  
తనను కావాలని పక్కన పెడుతున్నారని, అవమానిస్తున్నారని తెలిసినా అచ్చెన్నాయుడు అన్ని సమావేశాలకు హాజరవుతున్నారు. ఆ సమావేశాల్లో కింది స్థాయి నాయకుడిలా ఒక పక్కన కూర్చోవడం, నాలుగైదు సార్లు అడిగిన తర్వాత అవకాశం ఇస్తే మాట్లాడడం తప్ప ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. నారా లోకేశ్‌ అచ్చెన్నను అసలు పట్టించుకోవడంలేదు. అచ్చెన్నాయుడు పేరు చెబితేనే మండిపడుతున్నట్లు సమాచారం. అసలు అధ్యక్ష పదవి కూడా అచ్చెన్నకు తీసివేసి తాను సూచించిన మరొకరికి ఇవ్వాలని లోకేశ్‌ చాలాకాలం పట్టుబట్టినట్లు తెలిసింది.

కానీ సామాజిక సమీకరణలతో ఆయన్ను ఉంచాలని చంద్రబాబు చెప్పడంతో పేరుకే ఆయన్ను కొనసాగిస్తున్నారు. అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా లోకేశ్‌ తనకు అనుకూలమైన కళా వెంకట్రావును ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అచ్చెన్న స్థానంలో ఆయన సోదరుడి కుమారుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడికి ప్రాధాన్యం ఇస్తు­న్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా జరుగుతున్న సమావేశాల్లోనూ ఆయన్ను పట్టించుకో­కుండా పక్కన పెట్టారనే చర్చ నడుస్తోంది. ఇదంతా చంద్రబాబుకు తెలియకుండా జరుగుతుందని అనుకోవడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాలతో అచ్చెన్నాయడు లోలోన తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్నారు.  

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top