5న నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభ.. మీటింగ్‌ సక్సెస్‌కు కేసీఆర్‌ స్కెచ్‌ ఏంటి?

BRS Public Meeting In Maharashtra Nanded On February 5th - Sakshi

జాతీయస్థాయి విస్తరణలో భాగంగా ఏర్పాట్లు

మహారాష్ట్ర నేతలతో 3 రోజులుగా కేసీఆర్‌ భేటీలు

ఖమ్మం సభ తరహాలో భారీగా జరపాలని దిశానిర్దేశం..

తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచీ జన సమీకరణకు యోచన

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో భారత్‌ రాష్ట్ర సమితి విస్తరణ, జాతీయ రాజకీయాల దృష్టిని మరింతగా ఆకర్షించడం లక్ష్యంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభను నిర్వహించాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ తొలి సభ విజయవంతమైందని.. ఈ ఊపులోనే మరో సభతో పార్టీలో ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు. 

నాందేడ్‌ సభకు అవసరమైన ఏర్పాట్లపై మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలతో ప్రగతిభవన్‌లో మూడు రోజులుగా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. సభ విజయవంతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.

ముందే నిర్వహించాలనుకున్నా..
నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభను ఈ నెల 29వ తేదీనే నిర్వహించాలని తొలుత భావించారు. కానీ అక్కడ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఫిబ్రవరి 5ని ముహూర్తంగా ఎంచుకున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర శాసనమండలిలో రెండు పట్టభద్రుల, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 2న ఓట్ల లెక్కింపు ఉంది. దీనితో ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్‌ సభ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 3న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే సమావేశాలకు 4, 5 తేదీల్లో విరామం ఇవ్వనుండటంతో 5న నాందేడ్‌ సభకు అనుకూలంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

భారీగా చేరికలు, ముఖ్య నేతలకు ఆహ్వానాలు
నాందేడ్‌ సభ వేదికగా మహారాష్ట్రకు చెందిన ముఖ్యనేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఖమ్మం సభకు సీఎం కేసీఆర్‌తో పాటు ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎం హాజరైన తరహాలోనే నాందేడ్‌ సభకు కూడా వివిధ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నాయి. సభ నిర్వహణ ఏర్పాట్లు, చేరికలు, ఆహ్వానితులపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. సభ కోసం ఈ నెల 5న నాందేడ్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ అక్కడి గురుద్వారాను సందర్శించనున్నారు.

మంత్రులకు బాధ్యతలు!:
పొరుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సభ కావడంతో ఖమ్మం సభను తలపించేలా భారీగా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర నేతలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌తోపాటు మరికొందరు నేతల బృందానికి అప్పగించనున్నట్టు సమాచారం. నాందేడ్‌ సభకు తెలంగాణ సరిహద్దు జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కూడా కొంతమేర జన సమీకరణ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top